చిన్నారిని బలితీసుకున్న కామాంధుడు: బిస్కెట్ ప్యాకెటే పట్టించింది..
గుంటూరు: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ముక్కు పచ్చలారని ఓ చిన్నారిని ఓ కామాంధుడు బలితీసుకున్నాడు. అత్యాచారం చేసి ఆపై దారుణంగా హతమార్చాడు. తొలుత తనకేమి ఎరుగనట్టు బాలిక ఆచూకీ కోసం తల్లిదండ్రులతో కలిసి గాలించిన అతను.. పోలీసుల విచారణలో ఎట్టకేలకు నిజం అంగీకరించక తప్పలేదు. 96 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు.

అసలేం జరిగింది:
నల్గొండ జిల్లా, చందంపేట మండలం, కంబాలపల్లి గ్రామానికి చెందిన కేతావత్ బాలూనాయక్ గుంటూరు జిల్లా మాచర్ల మండలం, కొత్తూరు గ్రామంలో గొర్రెలు మేపుతూ బతుకుతున్నాడు. ఎనిమిదేళ్ల నుంచి అతను అదే గ్రామంలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలిక మనీషాపై అతని కన్ను పడింది. ఇందుకోసం ఆమె తండ్రితో స్నేహం పెంచుకుని, తద్వారా బాలికకు దగ్గరవాలని ప్లాన్ వేశాడు.

బాలిక తండ్రికి దగ్గరై..:
బాలిక తండ్రికి మద్యం తాగించడం ద్వారా అతనికి మరింత దగ్గరయ్యాడు బాలు నాయక్. చిన్నారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకుంటూ.. బాధ్యత తెలిసిన వ్యక్తిలా నటించేవాడు. కానీ అతని మనసులోని కుతంత్రం గురించి తెలియని బాలిక తండ్రి అతన్ని బాగానే నమ్మాడు.

కల్లు తాగుదామని తీసుకెళ్లి:
ఈ నెల 22న బాలిక తండ్రికి ఫోన్ చేసి తాటికల్లు తాగడానికి వెళ్దాం రమ్మని పిలిచాడు బాలు నాయక్. ఇద్దరు కలిసి కల్లు తాగాక.. సమీపంలో జరుగుతున్న ఓ జాతరలో భోజనం చేశారు. అనంతరం బాలిక తండ్రిని ఇంటివద్ద దిగబెట్టాడు. ఆ సమయంలో మనీషా ఏం చేస్తోందంటూ ఆరా తీశాడు. అంగన్ వాడీ స్కూలుకు వెళ్లిందని చెప్పడంతో.. అక్కడి నుంచి స్కూల్ వద్దకు వెళ్లాడు బాలు నాయక్.

రేప్, హత్య:
అంగన్ వాడీ స్కూల్ ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారిని చూసి.. బిస్కెట్ ప్యాకెట్ ఆశచూపించాడు బాలు నాయక్. తనతో వస్తే మరిన్ని బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తానని చెప్పి ఊరి చివరకు తీసుకెళ్లాడు. ఆపై ఆ చిన్నారిపై అత్యాచారం చేసి అతిక్రూరంగా హింసించి చంపినట్టు పోలీసులు గుర్తించారు. హత్యానంతరం ఏమి ఎరగనట్టు గ్రామంలోకి వెళ్లిన అతను.. బాలిక తల్లిదండ్రులతో కలిసి ఆమె కోసం వెతుకుతున్నట్టు నటించాడని పోలీసులు వెల్లడించారు.

బిస్కెట్ ప్యాకెటే పట్టించింది:
సంఘటనా స్థలంలో దొరికిన బిస్కెట్ ప్యాకెటే నిందితుడు బాలు నాయక్‌ని పట్టించింది. ఆ బిస్కెట్ ప్యాకెట్‌ను చూపించి గ్రామస్తులను ఆరా తీయగా.. ఆ ప్యాకెట్‌తో బాలు నాయక్ బాలిక వద్దకు వెళ్లడం చూశామని కొంతమంది చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతని కోసం ఆరా తీయగా.. అప్పటికే పరారయ్యాడు. ఎట్టకేలకు విజయపురి సౌత్‌లోని ఓ రహస్యప్రాంతంలో అతన్ని పట్టుకున్నారు పోలీసులు.












Click it and Unblock the Notifications