ఓపెన్ అయిన అన్నయ్య
Megastar Chiranjeevi: నేడు- తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ- మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు. తన 42వ జన్మదిన వేడుకలను జరుపుకొంటోన్నారాయన. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలిసి దావోస్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ఏర్పాటైన ప్రపంచ ఆర్థిక సదస్సు 2025లో పాల్గొంటోన్నారు.
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో వివిధ మల్టీ నేషనల్ కంపెనీల ఛైర్మన్లు, సీఈఓలతో వరుస భేటీలను నిర్వహిస్తోన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, ఇన్‌ఫ్రా.. వంటి రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులను సాధించడానికి కృషి చేస్తోన్నారు. నెక్ట్స్‌జెన్, డాటా ఫ్యాక్టరీ, ఏఐ యూనివర్శిటీ ఏర్పాటు వంటి అంశాలపై ఎన్‌విడియా, గూగుల్ వంటి సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరవుతున్నారు.

అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తోన్నారు. విజయనగరం టీడీపీ కార్యాలయంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 41 కేజీల కేక్‌ను కట్ చేశారు. భారీ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.
టీడీపీ పొలిట్‌బ్యురో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దీన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు రక్తదానం చేశారు.
మంత్రి నారా లోకేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో మెగాస్టార్ చిరంజీవి సైతం ఉన్నారు. తెలుగు ప్రజలకు సేవ చేయాలనే నిర్విరామ కృషి, అభిరుచి హర్షణీయమని అన్నారు. ఏపీని మరింత అభివృద్ధిపథంలో నడిపించడానికి అహర్నిశలు శ్రమిస్తోండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్రాభివృద్ధి కోసం నారా లోకేష్ సాగిస్తోన్న అన్ని ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు చిరంజీవి. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్- అనేక చర్చలకు దారి తీసింది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చనే ఊహాగానాలకు తెరలేపింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో మున్ముందు చిరంజీవి ఎలాంటి పాత్రను పోషించవచ్చనే చర్చలకు కేంద్రబిందువు అయింది. దీనికి అనుగుణంగానే ఈ ట్వీట్‌కు రిప్లైలు పోస్ట్ అవుతున్నాయి.
Wishing you a Very Happy Birthday dear @naralokesh ! Your relentless hard work and passion to serve Telugu people and achieve greater growth for AP are heartening. May you succeed in all your endeavours !! Have a wonderful year ahead! 💐
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 23, 2025
టీడీపీ కూటమి ప్రభుత్వం పట్ల తాను సానుకూలంగా ఉన్నాననే విషయాన్ని చిరంజీవి చెప్పకనే చెప్పినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. భవిష్యత్తులో చిరంజీవికి ఢిల్లీ స్థాయిలో కీలక పదవి లభించే అవకాశం ఉందని, దీనికి చంద్రబాబు నుంచి సంపూర్ణ మద్దతును ఆయన కోరుకుంటోన్నారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications