కోడిపురాణం చెప్పిన ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్; టీడీపీ వదిలిపెట్టట్లేదుగా!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఫార్ములా రేస్ లు ఎప్పుడు నిర్వహిస్తారు అని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పిన సమాధానమే ఆయన కొంపముంచింది. ఆయనను టీడీపీ నేతలు ట్రోల్ చేసేలా చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతోంది. ఏ చిన్న అవకాశం దొరికిన ఎవరు ఎవరిని టార్గెట్ చేయాలి అన్న దానిపైన ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. మాట్లాడే మాటల్లో తప్పు దొరికితే చాలు టార్గెట్ చేసేస్తున్నారు. టిడిపి నాయకులు మాట్లాడిన మాటలకు కౌంటర్లు వేస్తూ వైసిపి, వైసీపీ మంత్రులు, నాయకులు మాట్లాడిన వాటికి కౌంటర్లు వేస్తూ టిడిపి నాయకులు హంగామా చేస్తున్నారు. ఇక తాజాగా ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యల వీడియోను వైరల్ చేస్తున్నారు.

ఈ ఫార్ములా రేసుల గురించి ఆసక్తికర సమాధానం చెప్పిన మంత్రి అమర్నాథ్
ఇంతకీ ఏం జరిగిందంటే ఇటీవల హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ కు ఏపీ ప్రభుత్వం తరఫున అతిథుల్లో ఒకరిగా ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెళ్ళారు. అక్కడ ఫార్ములా ఈ రేసింగ్ ను చూశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ తో ఆయన చట్టా పట్టాలేసుకుని తిరిగారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఫార్ములా రేస్ లు ఎప్పుడు నిర్వహిస్తారు అని విలేకరులు అడిగిన ప్రశ్నకు గుడివాడ అమర్నాథ్ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. ఇక ఆ సమాధానమే ఆయన కొంపముంచింది.
ఈ ఫార్ములా రేసుల గురించి అడిగితే కోడి పురాణం చెప్పిన అమర్నాథ్
ఈ ఫార్ములా రేసుల గురించి అడిగితే కోడి పురాణం చెప్పారంటూ ఆయనను టార్గెట్ చేస్తున్నారు నెటిజన్లు. తెలుగుదేశం పార్టీ నేతలు సైతం గుడివాడ అమర్నాథ్ టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. అసలు ఇంతకీ గుడివాడ అమర్నాథ్ ఏం చెప్పారంటే ఈ ఫార్ములా రేసులు ఏపీలో ఎప్పుడు నిర్వహిస్తారు అని అడిగిన ప్రశ్నకు కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు.. కోడి కోడిని పెట్టలేదు కదా.. సో ముందుగా కోడి గుడ్డు పెట్టాలి. దాన్ని హ్యాచ్ చేయాలి. దాన్ని కోడిగా మార్చాలి. ఏపీలో ఇప్పుడే కోడి గుడ్డు పెట్టింది దాన్ని కోడిపెట్టగా మార్చడానికి టైం పడుతుంది అంటూ కోడిపురాణం చెప్పారు గుడివాడ అమర్నాథ్.

ఏపీ ఐటీ మంత్రిపై నెటిజన్లు ట్రోల్
ఇక ఈ ఫార్ములా రేసుల గురించి అడిగితే కోడిగుడ్డు అంటూ కథ చెప్పిన ఏపీ ఐటీ మంత్రిని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఈ కోడి గుడ్డు కదా ఏంటి అని తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ఇక టిడిపి నేతలు కూడా ఏమాత్రం తగ్గకుండా గుడివాడ అమర్నాథ్ ను టార్గెట్ చేస్తున్నారు. మన లెజెండరీ మంత్రి గుడివాడ అమర్నాథ్ .. మనల్ని ఎవర్రా ఆపేది .. ఏదైనా మాట్లాడొచ్చు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
షాకింగ్ ట్వీట్ చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి
తాజాగా టిడిపి నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గోరంట్ల పలుకు పేరుతో ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు కోడిని పెట్టలేదు అని అమరం చెప్పారని పేర్కొన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోడి గుడ్డు మాత్రమే కాదు కోడి కత్తితో కూడా గుచ్చగలదు అని ప్రజలు చెబుతున్నారు అంటూ సెటైర్లు వేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ బర్డ్ కోడి అంటూ టార్గెట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications