ఏపీ ప్రభుత్వం చేసిన పని చెప్పిన మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు కొనసాగిస్తున్న వేళ, తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఏది మాట్లాడినా అది ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తమదైన శైలిలో తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేయగా, ఇక తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
సంగారెడ్డి జడ్పీ మీటింగ్ లో పాల్గొన్న ఆయన మోటర్లకు మీటర్లు పెట్టలేదని తెలంగాణ రాష్ట్రానికి వచ్చే 30 వేల కోట్ల రూపాయలను కేంద్రం ఆపిందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మోటార్లకు మీటర్లు పెట్టి డబ్బులు తెచ్చుకున్నది అంటూ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఇదేనని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. వారు చెప్పిన మాట విన్నవారిని ఒకలాగా, అదేమని ప్రశ్నించిన వారిని మరోలాగా కేంద్రం చూస్తుందని హరీష్ రావు తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలతో కేంద్రంలోని బీజేపీ మాటను ఏపీ ప్రభుత్వం వింటుందనే అర్ధం వచ్చేలా మాట్లాడారు.
అంతేకాదు 1350 కోట్ల రూపాయల వెనుకబడిన జిల్లాల నిధిని కేంద్రం ఆపిందని మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రావాల్సిన 24 వేల కోట్ల రూపాయలను కూడా ఇవ్వలేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులను కూడా కేంద్రం తోసిపిచ్చిందని నీతి ఆయోగ్ 1300 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పినా కేంద్రం ఇవ్వలేదని హరీష్ రావు మండిపడ్డారు.
తెలంగాణకు అడుగడుగునా కేంద్రం అన్యాయం చేసిందన్నారు. అంతెందుకు రైతుల విషయంలో కూడా కేంద్రం దారుణంగా వ్యవహరించిందని పేర్కొన్న హరీష్ రావు రైతుల కోసం కల్లాలు నిర్మిస్తే కేంద్రం డబ్బులు వాపస్ కట్టించుకుందని ఆరోపించారు.
తెలంగాణలో వ్యవసాయానికి కరెంటు సరిపోవడం లేదని అదనంగా యూనిట్ కు 20 రూపాయలు ఇచ్చే విద్యుత్తు కోసం నెలకు 1500 కోట్ల రూపాయలు చెల్లించి విద్యుత్తు తీసుకుంటున్నామని హరీష్ రావు పేర్కొన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని, కేంద్రం రైతుల కోసం చేసిన మేలు ఏమీ లేదని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications