వైఎస్ వివేకాతో పాటు, హత్యకేసు నిందితుల అనుమానాస్పద మరణాలపై మంత్రి నిమ్మల సంచలన డిమాండ్
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డే అసలు లబ్ధిదారుడని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన వైఎస్ వివేకా హత్యపై సంచలన ఆరోపణలు చేశారు.
నాడు లోటస్ పాండ్‌లో జగన్ బటన్ నొక్కితేనే పులివెందులలో వివేకా ప్రాణాలు పోయాయి అని రామానాయుడు ఆరోపించారు. హత్య కేసులో రెండో నిందితుడు సునీల్ యాదవ్ చెప్పిన వాంగ్మూలంపై జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఈ మౌనం నేరపూరితమని, హత్యకు సంబంధం ఉన్నట్టు అంగీకరించడమేనని ఆయన అన్నారు.

వైఎస్ వివేకా హత్యకేసులో కీలక సాక్షులు వరుసగా అనుమానాస్పదంగా మరణించిన విషయాన్ని కూడా నిమ్మల రామానాయుడు టార్గెట్ చేశారు. కసనూరు శ్రీనివాస్ రెడ్డి, ఆసుపత్రి యజమాని ఈసీ గంగిరెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డి, డ్రైవర్ నారాయణ, అభిషేక్ రెడ్డి, వాచ్‌మెన్ రంగయ్య వంటి వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు మరణించారని పేర్కొన్నారు. ఇవన్నీ జగన్ మార్క్ హత్యలేనని ఆరోపించారు.
హత్య కోసం రూ.40 కోట్లు చేతులు మారాయని, ఆ డబ్బు ఇచ్చే స్తోమత జగన్ కుటుంబానికే ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ నగదు తాడేపల్లి ప్యాలెస్ పరిధిలోనే చేతులు మారిందని చెప్పారు. హత్య జరిగిన రోజు వేకువజామునే సమాచారం అందినా, సాయంత్రం వరకు హైదరాబాద్‌లోనే ఉండిపోయి సాక్ష్యాలు తారుమారు చేశారా అని ప్రశ్నించారు.
వివేకా గుండెపోటుతో చనిపోయారని సాక్షి ఛానల్‌లో తప్పుడు కథనాలు ప్రసారం చేయించారని కూడా ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కోరిన జగన్, అధికారంలోకి వచ్చాక సీబీఐపై దాడులు చేయించారని విమర్శించారు. వివేకా హత్యతో అంతిమంగా లబ్ధి పొందింది జగన్, ఆయన కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రమేనని రామానాయుడు స్పష్టం చేశారు.
నేరాలలో తాత రాజారెడ్డి వారసత్వాన్ని జగన్ పుణికి పుచ్చుకున్నారని నిమ్మల రామానాయుడు విమర్శించారు. ప్రతీవారం ప్రెస్ మీట్స్ పెట్టి గంటల తరబడి ఉపన్యాసాలు ఇచ్చే జగన్ బాబాయ్ హత్య గురించి ఎందుకు నోరెత్తటం లేదో జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.













Click it and Unblock the Notifications
