చంద్రబాబు మాట కాదు.. చిరంజీవి మాట విను: పవన్‌కళ్యాణ్‌కు మంత్రి రోజా హితవు!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు తిరుపతిలో మాట్లాడిన రోజా పవన్ కళ్యాణ్ తాను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన రోజా పవన్ ఒక రోజు సీఎం అవుతాను అంటాడు.. మరో రోజు ఎమ్మెల్యే కావాలి అంటాడు, ఇంకోరోజు ఇప్పుడు గెలవలేము అంటాడు అంటూ సెటైర్లు వేశారు.
పవన్ వ్యాఖ్యలు క్లారిటీ లేకుండా ఉన్నాయని వైసీపీ నేతలను తిట్టడం కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినట్టుగా ఉందని మంత్రి రోజా పేర్కొన్నారు. పార్టీ పెట్టిన వ్యక్తికి ప్రజలకు ఏం చేస్తారో క్లారిటీ ఉండాలని పవన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన రోజా, ప్రజలకు ఏమి చేస్తాడో చెప్పకుండా తమపై చీప్ కామెంట్లు చేస్తున్నాడని అసహనం వ్యక్తం చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ పవన్ చదువుతున్నారని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను వాడుకుని వదిలేస్తారని రోజా చెప్పారు. 2013లోనే మీ అన్నయ్య చిరంజీవి చంద్రబాబును నమ్మొద్దని చెప్పారని పేర్కొన్న రోజా పని అయిపోయిన తరువాత చంద్రబాబు ఆయనను వదిలేస్తారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట కాకుండా చిరంజీవి మాట వినాలని రోజా హితవు పలికారు.
పవన్ కళ్యాణ్ రాజకీయాలు వదిలేసి సినిమాలు చేసుకోవటం మేలని, లేకుంటే రెండు చోట్ల పరువు పోగొట్టుకుంటాడని మంత్రి రోజా తేల్చిచెప్పారు. అందరూ గుంపుగా రాకపోతే 2024 లో జగన్ మళ్లీ సీఎం అవుతారని పవన్ అన్నారని, అందరూ గుంపుగా వచ్చినా, సింగిల్ గా వచ్చినా మళ్లీ జగనే సీఎం అంటూ మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ పవన్ అందరి దృష్టిలో విలన్ అయ్యారని మంత్రి రోజా పేర్కొన్నారు. తమను కొడతామని చెప్పడానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడా అంటూ మంత్రి రోజా ప్రశ్నించారు. నాకు ఓటు వేసే వారే మీటింగ్ కి రావాలని పవన్ చెబుతున్నాడని, ప్రజలకు అన్ని చేస్తున్న జగన్ ను కాదని పవన్ కు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని రోజా నిలదీశారు.
అమ్మవారి పేరు పెట్టుకొని వారాహి యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ బూతు పురాణం వల్లిస్తున్నాడని మంత్రి రోజా విమర్శించారు. తనకు ఆరోగ్యం బాగోలేదని జనసేన కార్యకర్తలు తనను ట్రోల్ చేస్తున్నారని పేర్కొన్న రోజా, మీ అంత తేలుస్తాను అంటూ హెచ్చరించారు. డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ మంత్రి రోజా వార్నింగ్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications