రివ్యూ: మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి.. అనుష్క, నవీన్ మూవీ ఎలా ఉందంటే
నటీనటులు: నవీన్ పొలిశెట్టి, అనుష్క, జయసుధ, మురళీశర్మ, తులసి, అభినవ్ గోమఠం, హర్షవర్ధన్, సోనియాదీప్తి, భద్రమ్ తదితరులు
సంగీతం: రధన్
నేపథ్య సంగీతం: గోపీసుందర్
నిర్మాణం: యూవీ క్రియేషన్స్
రచన, దర్శకత్వం: పి.మహేష్ బాబు
కథ: అన్విత రవళిశెట్టి (అనుష్క) మాస్టర్ చెఫ్. లండన్ లోని ఓ స్టార్ హోటల్ లో పనిచేస్తుంటుంది. ప్రేమ, వివాహం, అనుబంధాలపై ఏమాత్రం నమ్మకం ఉండదు. తన తల్లిని ప్రేమించి పెళ్లిచేసుకున్నవాడు మోసం చేయడమే దీనికి కారణం. అయితే తల్లి అనారోగ్యంతో కన్నుమూయడంతో ఒంటరితనం నుంచి బయట పడటానికి తోడు వెతుక్కోవాలనుకుంటుంది. పెళ్లి చేసుకోకుండానే ఐయూఐ విధానంలో ఓబిడ్డను కనాలనుకుంటుంది.

దీనికోసం వీర్యదాత ఎవరు ఉంటారా? అని వెతుకుండగా స్టాండప్ కమెడియన్ సిద్ధు పొలిశెట్టి (నవీన్) పరిచయమవుతాడు. తన బిడ్డకు ఎలాంటి తండ్రి కావాలనుకుంటుందో అటువంటి లక్షణాలన్నీ అతనిలో కనిపించడంతో సిద్ధూ సహాయం తీసుకోవాలనుకుంటుంది. అన్వితతో పరిచయం వల్ల సిద్ధూ ఆమెతో ప్రేమలో పడతాడు. ప్రపోజ్ చేస్తే తనకు ప్రేమ, పెళ్లి లాంటివి ఇష్టం లేదని చెబుతుంది. దీంతో సిద్ధూ షాక్ తింటాడు. తన ప్రేమను గెలిపించుకోవడానికి సిద్ధూ ఏం చేశాడు? ప్రేమ, పెళ్లికి వ్యతిరేకంగా ఉన్న అన్వితను ఎలా మార్చాడు? చివరకు ఇద్దరూ కలిశారా? లేదా? అనేది తెరపై చూడాలి.
ఎవరెలా చేశారంటే: దర్శకుడు మంచి వినోదంతోపాటు చక్కటి భావోద్వేగాలు మేళవించి ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరించారు. కామెడీ, ఎమోషన్స్ తో రెండున్నర గంటలపాటు ప్రేక్షకుణ్ని కూర్చోపెట్టగలిగాడు. స్టాండప్ కమెడియన్ సిద్ధు పొలిశెట్టి పాత్రలో నవీన్ పొలిశెట్టిని తప్ప వేరే ఎవరినీ ఊహించుకోలేం. అంతగా ఆ పాత్రలో నవీన్ ఒదిగిపోయాడు. తనదైన కామెడీ టైమింగ్ తో ఆ పాత్రను చాలా అవలీలగా పోషించాడు. ప్రేక్షకుల్ని బాగా నవ్వించాడు. క్లైమాక్స్ లో చక్కటి భావోద్వేగాలు పండించాడు.

అన్విత పాత్రలో అనుష్క సెటిల్డ్ గా నటించింది. ఆమె పాత్రను దర్శకుడు హుందాగా తీర్చిదిద్దారు. నవీన్-అనుష్క కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ లో తన నటనతో అందరి మదిని బరువెక్కిస్తుంది. దర్శకుడు తాను రాసుకున్న కథకు కాస్త బోల్డ్ టచ్ ఇచ్చినప్పటికీ ఎక్కడా గీత దాటలేదు. హద్దు మీరకుండా తాను చెప్పాలనుకున్న విషయాన్ని వినోదాత్మకంగా చూపించారు. అమ్మాయి, అబ్బాయి మధ్య ఏమీ జరగకున్నా.. ఒక్క ముద్దు కూడా పెట్టుకోకపోయినా ప్రేమ పుడుతుందని దర్శకుడు చెప్పిన విధానం బాగుంది.
డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఈ సినిమాకు కథా నేపథ్యంతోపాటు నవీన్, అనుష్క నటన, కామెడీ, భావోద్వేగాలు ప్లస్ పాయింటయ్యాయి. కాకపోతే కథనం కాస్తంత స్లోగా సాగుతుంది. మొత్తానికి మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి అందరినీ ఆకట్టుకుంటారు. నవ్విస్తూనే బాధపెడతారు.












Click it and Unblock the Notifications