బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. వాయుగుండంగా, అనంతరం తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందింది. దీని ప్రభావంతో నేటి నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం ఏపీపైనా పడింది. పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు తోడు కావడం వల్ల ఇప్పుడున్న చలి తీవ్రత మరింత పెరుగుతుందని భారత వాతావరణ కేంద్రం సూచించింది.
ఈ నెల 5వ తేదీన బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో ఈ ఆవర్తనం ఏర్పడింది. తమిళనాడు దక్షిణ ప్రాంతం, శ్రీలంక తీరం మీదుగా విస్తరించింది. క్రమంగా ఇది అల్పపీడనంగా మారింది. తదనంతరం వాయుగుండంగా ఆవిర్భవించింది. గురువారం అర్ధరాత్రి తీవ్ర వాయుగుండంగా అవతరించింది. ఈ వ్యవస్థ ప్రస్తుతం శ్రీలంకలోని హంబన్‌టోటాకు 410, చెన్నైకి నైరుతి దిశగా 980 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది.

ఫలితంగా తమిళనాడు, కేరళల్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. జనవరిలో తీవ్ర వాయుగుండం, తుఫాన్ ను తమిళనాడు ఎదుర్కొంటోండటం 135 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. డెల్టా ప్రాంతం, కోస్తా, ఉత్తర తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వచ్చే 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయి ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం నాడు రామనాథపురం, పుదుక్కోటై, తంజావూరు, తిరువారూర్, నాగపట్టణం జిల్లాలతో పాటు కారైకల్ ప్రాంతంలో అక్కడక్కడా భారీ వర్షాలు పడ్డాయి
నేడు కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది. నాగపట్టణం, తిరువారూర్, కారైకల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, రామనాథపురం, తంజావూరు, మైలాడుతురై, పుదుక్కోట, కడలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. వీటితో పాటు శని, ఆాదివారాల్లో అరియలూర్, విల్లుపురం, కాల్లకురిచి, చెంగల్పట్టు, చెన్నై, కాంచీపురం, తిరువళ్ళూరు, తంజావూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఆదివారం వరకూ వర్షాలు కొనసాగుతాయి. ఈ తడి వాతావరణం ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
దీని ప్రభావంతో కేరళ ఉత్తర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కాసర్ గాడ్, కన్నూర్, ఇడుక్కి జిల్లాలపై దీని ప్రభావం ఉంది. ఇడుక్కి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. అలాగే- తమిళనాడును ఆనుకుని ఉన్న ఏపీ దక్షిణ ప్రాంతం, రాయలసీమ జిల్లాలపైనా వర్షాల పడనున్నాయి. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది.












Click it and Unblock the Notifications