బాబుకు షాక్: హరికృష్ణ, జూ. ఎన్టీఆర్ బిజెపి వైపు?

రాష్ట్రంలో ఓ కేంద్ర మంత్రి తమ వైపు వస్తారని ఎం. వెంకయ్యనాయుడు చెప్పిన మాట వేడివేడి చర్చకు దారి తీసింది. ఆ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కావచ్చుననే మాట వినిపిస్తోంది. పురంధేశ్వరి భర్త ప్రస్తుత కాంగ్రెసు శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు గతంలో కొంత కాలం బిజెపిలో ఉన్నారు. పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభావం రాష్ట్రంపై కూడా తీవ్రంగానే పడుతుందని భావిస్తుంది. ముఖ్యమంగా సీమాంధ్రలో మోడీ ప్రభావం ఎక్కువగా పనిచేస్తుందని అంటున్నారు.
పురంధేశ్వరి బిజెపిలో చేరితే తెలుగుదేశం పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా అటు వైపు మళ్లే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఎలాగూ దగ్గుబాటి వెంకటేశ్వర రావు పురంధేశ్వరితో పాటు బిజెపిలోకి వెళ్లే అవకాశాలుంటాయి. పురంధేశ్వరి అంటే హరికృష్ణకు అమితమైన అభిమానం. పురంధేశ్వరి కాంగ్రెసులో ఉన్నప్పటికీ తండ్రి ఎన్టీ రామారావు కాంగ్రెసు వ్యతిరేక విధానం కారణంగా హరికృష్ణ అటు వైపు చూడలేదని అంటున్నారు.
ఎన్టీ రామారావు కాంగ్రెసు వ్యతిరేక విధానానికి అనుగుణంగా బిజెపిలో చేరడానికి హరికృష్ణకు ఏ విధమైన ఆటంకాలు ఉండకపోవచ్చు. పురంధేశ్వరితో పాటు హరికృష్ణ పార్టీలోకి వస్తే జూనియర్ ఎన్టీఆర్ మద్దతు బిజెపికి ఉండి తీరుతుందని అంటున్నారు. అలాంటి పరిస్థితి వస్తే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి బిజెపితో పొత్తు పెట్టుకోవడం కష్టమే కావచ్చు. బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు చాలా ఉత్సుకతతో ఉన్నారనే విషయం వేరుగా చెప్పాల్సిన పని లేదు.
చంద్రబాబుతో ముందుగానే పొత్తు ఖరారు చేసుకుంటే పురంధేశ్వరి, హరికృష్ణ బిజెపిలోకి రావడానికి వెనకాడవచ్చు. ఈ దృష్ట్యానే బిజెపి రాష్ట్ర నాయకత్వం తెలుగుదేశం పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్నట్లు భావించడానికి వీలవుతోంది. హరికృష్ణ బిజెపి నాయకులతో సన్నిహితంగానే ఉన్నట్లు చెబుతున్నారు. తాను రాజీనామా చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలకు రాసిన బహిరంగ లేఖను ఢిల్లీలోని బిజెపి పార్లమెంటరీ కార్యాలయం నుంచే మీడియాకు పంపించారు.
గతంలో హరికృష్ణ పత్రికా ప్రకటనలు, బహిరంగ లేఖలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి వెలువడేవి. కానీ, ఆ లేఖ మాత్రం బిజెపి పార్లమెంటరీ కార్యాలయం నుంచి విడుదలైంది. అప్పటి నుంచే హరికృష్ణ బిజెపికి దగ్గరయ్యారనే ప్రచారం ప్రారంభమైంది. అయితే, తాను తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీని వీడబోనని జూనియర్ ఎన్టీఆర్ ఒకటి రెండు సార్లు చెప్పారు. తండ్రి హరికృష్ణ బిజెపిలో చేరితే జూనియర్ ఎన్టీఆర్ మౌనంగా ఉంటారా, ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తారా అనేది ఇప్పుడు చెప్పడం కష్టమే.












Click it and Unblock the Notifications