సహజీవనానికి అడ్డుగా ఉందని మూడేళ్ల చిన్నారిని కొరికి చంపిన తల్లి!
గుంటూరులో మూడేళ్ల చిన్నారిపై పాశవిక దాడి జరిగింది. అయితే నవమాసాలు మోసి కని, పెంచిన తల్లే బాలికపై దాడి చేయటం, అమానుషంగా కొరికి చంపటం సభ్య సమాజాన్ని సాక్ కు గురి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాజాగా ఒక మూడేళ్ళ చిన్నారిని గుంటూరుకు చెందిన తల్లి నాగలక్ష్మి, సుభాష్ అనే వ్యక్తి గుంటూరు జీజీహెచ్ కు తీసుకొచ్చారు.
ఒంటిపై గాయాలు ఉండటంతో వైద్యులు పరీక్షించగా చిన్నారి ఇప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే గాయాలు ఎలా అయ్యాయని వైద్యులు అడిగినప్పుడు మెట్ల నుంచి పడి గాయాలయ్యాయని తల్లి చెప్పింది. ఒంటిపై తీవ్ర గాయాలు, కొరికిన గాట్లు కనిపించడంతో వైద్యులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మొదట కొత్తపేట పోలీసులు, తర్వాత అరండల్పేట పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. చిన్నారి మృతదేహాన్ని మార్చరీకి తరలించారు. ప్రస్తుతం నాగలక్ష్మి, సుభాష్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నాగలక్ష్మికి ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్తతో వివాదాలు రావడంతో విడిపోయారు. పెద్ద కుమార్తెను తండ్రి తీసుకెళ్లగా, చిన్న కుమార్తె ఇషిక తల్లి వద్దే ఉంది.
ఆ తర్వాత నాగలక్ష్మికి సుభాష్తో పరిచయం ఏర్పడి సహజీవనం ప్రారంభించారు. చిన్నారి అడ్డుగా ఉందని కొన్ని రోజులుగా హింసిస్తున్నారని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అలా హింసించటంలో భాగంగానే చిన్నారిని కొరికి చంపేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి చిన్నారిని దారుణంగా హతమార్చటం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.
చిన్నారుల రక్షణ కోసం చట్టాలు ఉన్నప్పటికీ, కుటుంబాల్లో హింస కేసులు పెరుగుతున్నాయి. అయితే చిన్నారులపై హింస ఘటనలపై పొరుగువారు, బంధువులు ఏదైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు లేదా చైల్డ్లైన్ 1098కు సమాచారం ఇవ్వాలి. పాఠశాలలు, అంగన్వాడీలు, ఆసుపత్రుల్లోనూ చిన్నారులపై గాయాలు కనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది.
పోలీసులు దర్యాప్తు వేగంగా చేపట్టి నిజాలు బయటపెట్టాలని స్థానికులు కోరుతున్నారు. చిన్నారి మరణం వెనుక ఉన్న కారణాలు స్పష్టం కావాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది. పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications
