ఢిల్లీకి లోకేష్- టీడీపీ రాజకీయం హస్తినకు షిఫ్ట్: అమిత్ షా అపాయింట్..?!
రాజమండ్రి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
ఢిల్లీకి లోకేష్- టీడీపీ రాజకీయం హస్తినకు షిఫ్ట్: అమిత్ షా అపాయింట్..?!#NaraLokesh #DelhiTour #AmitShah #IAmWithBabu #PawanKalyan #YSJaganAgain #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/pFO9KSDkPD
— oneindiatelugu (@oneindiatelugu) September 14, 2023
2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

ఈ పరిణామాలన్నింటిపై జాతీయ స్థాయిలో ఉద్యమించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధపడినట్టే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ప్రతిపక్షాలను రాజకీయ దురుద్దేశాలతో వేధింపులకు గురి చేస్తోందనే అంశాన్ని జాతీయ మీడియా దృష్టికి వివరించే ప్రయత్నం చేయనుంది.
ఇందులో భాగంగా- తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కొద్దిసేపటి కిందటే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి టేకాఫ్ అయ్యారు. ఆయన వెంట శ్రీకాకుళం లోక్‌సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు.

మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన పర్యటన సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలుసుకుంటారని స్పష్టం చేస్తోన్నాయి. అమిత్ షా అపాయింట్ సైతం కోరినట్లు సమాచారం. దీనిపై ఆయన కార్యాలయం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులు, కొందరు జాతీయ స్థాయి నాయకులనూ నారా లోకేష్ కలుసుకుంటారని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్‌కు దారి తీసిన పరిణామాలన్నింటినీ ఆయన వారికి వివరిస్తారని, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం జరగలేదనే విషయంపై జాతీయ మీడియాకూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తారని సమాచారం.












Click it and Unblock the Notifications