నారా లోకేష్‌కు వేళాయెరా: ఎమ్మెల్సీగా ఎన్నిక, మంత్రివర్గంలోకి....
నారా లోకేష్ మంత్రివర్గంలోకి చేరేందుకు వేళయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనను ఎమ్మెల్సీగా ఎన్నిక చేసేందుకు రంగం సిద్ధమైనట్లు చెబుతున్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చట్టసభలోకి అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేగా కాకుండా ఎమ్మెల్సీగా రంగ ప్రవేశం చేసి, చంద్రబాబు మంత్రివర్గంలో చేరుతారంటూ వార్తలు వస్తున్నాయి. మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో జరిగే శాసనమండలి ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికవుతారని ప్రచారం జరుగుతోంది.
ఆంధ్రప్రదే్స రాష్ట్రంలో త్వరలో 22 ఎమ్మెల్సీ స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఎమ్మెల్యేల కోటా నుంచి ఏడు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. ప్రస్తుతం శాసనసభలో ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి పాలక టీడీపీకి ఆరు, వైసీపీకి ఒకటి ఎమ్మెల్సీ సీట్లు లభించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల కోటా నుంచే లోకేశ్ ఎన్నికవుతారని తెలిసింది.

నారా లోకే్, ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికైతే బాగుంటుందని పార్టీలోని కొందరు అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం శాసనసభా స్థానాలేవీ ఖాళీగా లేవు. దాంతో లోకేష్ శాసనసభలో అడగు పెట్టాలంటే ఎవరితోనైనా రాజీనామా చేయించి, అక్కడి నుంచి పోటీ చేయించాల్సి ఉంటుంది. వైయస్సార్ కాంగ్రెసు నుంచి టీడీపీలోకి వచ్చిన చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి తాను రాజీనామా చేస్తానని ముందుకు వచ్చారు. అక్కడి నుంచి లోకేశ్‌తో పోటీచేయించాలని ప్రతిపాదించారు.
అయితే, ఈ స్థానం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంకు ఆనుకుని ఉంది. తండ్రీకొడుకుల సీట్లు పక్కపక్కన ఉండడం సరికాదన్న అభిప్రాయంతో ఈ ప్రతిపాదనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఓ ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించి అక్కడి నుంచి పోటీ చేయించడం మంచిది కాదని సీనియర్లు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. అందువల్ల ఎమ్మెల్సీగా చట్ట సభలోకి తీసుకురావడం మంచిదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబెట్టవచ్చని వారు చంద్రబాబుకు సూచించారు.
చంద్రబాబు అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నారా లోకేష్ పోటీ చేసి శాసనమండలిలో అడుగు పెట్టి మంత్రి కావడం ఖాయమని అంటున్నారు. మంత్రి విస్తరణకు ముందే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయని, అందులో ఆయన ఎన్నికవుతారని పార్టీ వర్గాలు అంటున్నాయి.












Click it and Unblock the Notifications