పవన్ కల్యాణ్‌ది శిఖండి పాత్ర, చంద్రబాబును కాపాడేందుకే...: నారాయణ
చెన్నై/ విజయవాడ: తెలుగు సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సిపిఐ నాయకుడు నారాయణ విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ శిఖండి పాత్ర పోషిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యమాలు వచ్చినప్పుడు ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కాపాడేందుకే పవన్ కల్యాణ్ తెర మీదికి వస్తారని ఆయన అన్నారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చలేక కుల రాజకీయాలను, ఉద్యమాలను తీసుకుని వచ్చింది చంద్రబాబేనని ఆయన సోమవారం విమర్శించారు దమ్ముంటే రాజ్యాంగ సవరణ ద్వారా కాపులను బీసీల్లో చేర్చగలరా అని ఆయన ప్రశ్నించారు.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణకాష్టంలా తయారు కావడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే కారణమని సిపిఐ రాష్ట్ర కార్యదర్సి రామకృష్ణ విమర్శించారు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్లనే కాపులు రోడ్డెక్కారని ఆయన అన్నారు.
బీసీలకు అన్యాయం జరగకుండా కాపు రిజర్వేషన్లు ఎలా సాధ్యమవుతాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ప్రైవేట్ రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications