దేశం మొత్తం విజయవాడ వైపు చూసేలా.. మహిళాసంఘాల మెగా మేళా!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో ఘనత దక్కించుకోనుంది. దేశ వ్యాప్తంగాస్వయం సహాయక మహిళా సంఘాల జాతీయ సరస్ ఆజీవిక మేళా విజయవాడ వేదికగా జరగనుంది. విజయవాడలోని పున్నమి ఘాట్‌లో ఈ నెల 13 నుంచి 31వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనుంది. జాతీయ సరస్ మేళాను విజయవంతం చేసేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో కృషి చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు.
"జాతీయ సరస్ ఆజీవిక మేళా 2026" ఏర్పాట్లపై మంత్రి కొండపల్లి విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఢిల్లీ ఎన్‌సీఆర్ బయట తొలిసారిగా విజయవాడలో ఈ జాతీయ మేళా జరగడం మన రాష్ట్రానికే ఎంతో గర్వకారణం అన్నారు. మేళా విజయవంతం అయ్యేందుకు ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మొత్తం 576 స్టాళ్లను ఏర్పాటు చేస్తుండగా... దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1,500 మంది స్వయం సహాయక మహిళా సంఘాల మహిళా ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి తెలిపారు. ఈ మేళాలో చేనేత వస్త్రాలు, హస్తకళలు, సహజ ఆహార ఉత్పత్తులు, లైవ్ ఫుడ్ కోర్టులు, ఎఫ్‌పీఓ, సీఎల్‌ఎఫ్, సరస్ శక్తి కలెక్షన్ స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయని మంత్రి పేర్కొన్నారు.
లక్పతి దీదీ పెవిలియన్, బయ్యర్-సెల్లర్ పెవిలియన్, కన్వర్జెన్స్ పెవిలియన్, నాలెడ్జ్ సెంటర్ మరియు డెమాన్‌స్ట్రేషన్ ఏరియాలను మేళాలో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారన్నారు.
ఈ జాతీయ మేళాకు ప్రతిరోజూ 50,000 నుంచి 1,00,000 మంది వరకు సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామని.. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 15న ఈ మేళాను ప్రారంభించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
ఇటు దసరా ఉత్సవాల రద్దీ దృష్టిలో ఉంచుకుని.. భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించడంతో పాటు 24 గంటలు వైద్య బృందాలు, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే ఫుడ్ స్టాల్స్‌లో ఆహార నాణ్యత తనిఖీలు నిరంతరం జరగాలని అధికారులకు సూచనలు చేశారు. ప్రాంగణంలో పారిశుధ్య నిర్వహణ, సురక్షిత తాగునీరు, విద్యుత్ సౌకర్యాల కల్పనలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే స్వయం సహాయక సంఘాల మహిళలకు రవాణా, వసతి, ఆతిథ్య ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు రానివ్వకూడదన్నారు. సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, మేళా పూర్తయ్యే వరకు ప్రతిరోజూ సమీక్షలు నిర్వహించాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సదుపాయం కల్పించే ఈ గొప్ప మేళాను విజయవంతం చేసి మన రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచేందుకు అధికారులు పని చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.













Click it and Unblock the Notifications
