ఉచిత బస్సు ప్రయాణం, గూగుల్ ఉద్యోగాలపైన కూటమి ఎమ్మెల్యే షాకింగ్ వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖలో ఏర్పాటు చేయనున్న గూగుల్ డేటా సెంటర్ వ్యవహారం పైన అధికార టిడిపి కూటమి, ప్రతిపక్ష వైసిపి మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ చొరవతో విశాఖలో గూగుల్ 1.33లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందని, ఏపీకి ఇది చారిత్రాత్మక ఒప్పందం అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గూగుల్ డేటా సెంటర్ తో భారీ ఉద్యోగాలపై రగడ
గూగుల్ ఏఐ హబ్ ద్వారా విశాఖ ఏఐ సిటీ గా రూపాంతరం చెందుతుందని, ఈ పెట్టుబడుల ద్వారా మరిన్ని సంస్థలు విశాఖ వైపు దృష్టిసారిస్తాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక google డేటా సెంటర్ ఏర్పడితే భారీ ఉద్యోగాలు వస్తాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంటే, గూగుల్ డేటా సెంటర్ తో పెద్ద ఉద్యోగాలు వచ్చే సినిమా లేదని వైసిపి టార్గెట్ చేస్తోంది.

180000 ఉద్యోగాలు వస్తాయన్న ప్రచారంపై కూటమి ఎమ్మెల్యే
అయితే ఇదే సమయంలో గూగుల్ డేటా సెంటర్ తో ఒక లక్ష 80 వేల ఉద్యోగాలు వస్తాయని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో బిజెపి సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల 180000 ఉద్యోగాలు వస్తాయన్న మాట అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. డేటా సెంటర్ అంటే కాల్ సెంటర్ కాదని, సమాచారాన్ని నిల్వ చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఉచిత బస్సు ప్రయాణ పథకంపై బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
google సంస్థలో లక్ష ఎనభై వేల ఉద్యోగాలు వస్తాయనే విషయం సరికాదని, ప్రత్యక్షంగా అన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదన్నారు. ఇక్కడ ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అనేది సంఖ్యా పెద్ద సమస్య కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఇదే సమయంలో ఏపీలో అమలవుతున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం పైన మాట్లాడిన ఆయన ఈ ఉచిత బస్సు పథకం కారణంగా ఆర్టీసీ బస్సులలో మహిళల ఆధిపత్యం పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉచిత బస్సు ప్రయాణంతో మగవాళ్ళకు కష్టాలు
టికెట్ కొనుక్కొని ప్రయాణం చేస్తున్న పురుషులను సైతం మహిళలు దించే చేస్తున్నారని ఈ విషయాన్ని ఆర్టీసీ యూనియన్ నాయకులు చెబుతున్నారని అన్నారు. మగవాళ్ళు తెగ ఇబ్బంది పడుతున్నారని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చేశారు సూపర్ సిక్స్ పథకాల అమలులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ,వాటిని పరిష్కరించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications