జానీ మాస్టర్ కేసులో మరో భారీ ట్విస్ట్-మైనర్ ను లైంగికంగా వేధించిన బాధితురాలు?
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు చేసిన బాధితురాలిపై ఇప్పుడు నెల్లూరులో ఓ కేసు నమోదైంది.
జానీ మాస్టర్ పై తాను చేసిన రేప్ ఆరోపణలు తేలకముందే ఇప్పుడు ఆమెపైనే ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదులో ఆమెపై సంచలన ఆరోపణలు కూడా చేశాడు. దీంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమవుతోంది.

జానీ మాస్టర్ తనను రేప్ చేసారని, లైంగికంగా వేధింపులకు గురి చేశారని ఆయన జూనియర్ కొరియోగ్రాఫర్ అయిన బాధితురాలు పెట్టిన కేసుపై హైదరాబాద్ లో ఓవైపు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు తాను మైనర్ గా ఉండగా.. సదరు బాధితురాలు తనను లైంగికంగా వేధించిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతే కాదు తనను ఎలా వేధింపులకు గురి చేసిందో ఫిర్యాదులో వివరించాడు.
జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు పెట్టిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తన మామ జానీ మాస్టర్ తో కలిసి హైదరాబాద్, చెన్నైలలో షూటింగులకు వెళ్లినప్పుడు వేధించినట్లు ఆ యువకుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమె లిఫ్ట్, రెస్ట్ రూమ్, లాడ్జిలో తనపై లైంగిక దాడి చేసి, నగ్న ఫొటోలు తీసి బెదిరించిందన్నాడు. అప్పుడు తాను మైనర్ నని చెప్పాడు, ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. దీనిపై పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరిస్తున్నారు. ఓవైపు లైంగిక వేధింపుల కేసులో బెయిల్ పై బయటికి వచ్చిన జానీ మాస్టర్ నెల్లూరులో తన బంధువులతోనే ఈ ఫిర్యాదు చేయించారన్న వాదన కూడా వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications