అమెజాన్ ప్రైమ్‌పై నెటిజన్ల "బాహుబలి" యుద్ధం
అమెజాన్ ప్రైమ్‌తో వీవర్స్ బాహుబలికన్నా భారీ యుద్ధాన్ని ప్రకటించారు. ప్రైమ్ పే ఫర్ వ్యూ విధానం తీసుకురావడంతో నెటిజన్లలో ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో వారు ట్విట్టర్‌లో యుద్ధం ప్రారంభించారు. తీవ్రస్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదంతా కేజీఎఫ్-2 చిత్రం కోసం. యష్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

5 భాషల్లో స్ట్రీమింగ్ హక్కులు
ఈ చిత్రానికి సంబంధించి ఐదు భాషల్లో స్ట్రీమింగ్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. అయితే నిర్మాతల దగ్గర నుంచి ఎంతకైతే కొనుగోలు చేసిందో అంతకుమించి రాబట్టడానికి కొత్త ప్రణాళిక రచించింది. పే ఫర్ వ్యూ విధానాన్ని ప్రవేశపెట్టి వినియోగదారులను షాక్‌కు గురిచేసింది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తున్న ఈ చిత్రానికి ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనుకుంటోందంటూ నెటిజన్ల కామెంట్లు పెడుతున్నారు.

రూ.199 చెల్లించి సినిమా చూడాలి
సాధారణంగా అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం కావాలంటే సంవత్సరానికి రూ.1499 పే చేయాలి. అలా పే చేసి తీసుకున్న వినియోగదారులు కూడా కేజీఎఫ్-2 చూడాలంటే అదనంగా రూ.199 పే చేయాలనే నిబంధన తీసుకువచ్చింది. దీనిపై ఓటీటీ ప్రియులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రూ.199 చెల్లించి చూడాల్సిన అవసరం లేదంటూ వివిధ ప్లాట్‌ఫామ్స్ లో డౌన్‌లోడ్ చేసిన హెచ్‌డీ ప్రింట్ లింక్స్ పెట్టి ఈ చిత్రాన్ని డౌన్‌లోడు చేసుకోండంటున్నారు. స్క్రీన్ షాట్స్ ని అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియా అకౌంట్ కు లింక్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు.

అనధికారిక డౌన్‌లోడ్ లింక్స్ షేర్ చేస్తున్నారు
మరికొందరు హెచ్‌డీ ప్రింట్స్ స్క్రీన్ షాట్స్ ని షేర్ చేస్తూ అమెజాన్ పై యుద్ధాన్ని ప్రకటించడం విశేషం. దీంతో ఈ అనధికారిక డౌన్ లోడ్స్ ని ఎలా ఆపాలో అర్థంకాక అమెజాన్ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. అమెరికాలోని పలు నగరాల్లో వినియోగదారుల ఇష్టం మేరకే పే ఫర్ వ్యూ విధానం అమల్లో ఉంది. అలా కాకుండా భారత్లో మాత్రం వినియోగదారుల నుంచి బలవంతంగా వసూలు చేయాలనుకోవడమనేది నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఈ ఉదంతంవల్ల అమెజాన్ ప్రైమ్ భారీగా నష్టపోయే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. రూ.199 చెల్లించే బదులు ఉచితంగా డౌన్‌లోడ్ లింకులు లభిస్తుండటంతో అందరూ వాటినే డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications