ఇకపై అమరావతిలో అరకు కాఫీ.. ఔట్ లెట్ లతో వారికి బూస్ట్!
అరకు కాఫీకి ఉన్న బ్రాండ్ ఎట్లాంటిదో అందరికీ తెలిసిందే . అటువంటి అరకు కాఫీ ఇకనుండి ఏపీ రాజధాని అమరావతిలో కూడా అందరికీ చేరువ కానుంది. రాజధాని ప్రాంతంలో అరకు కాఫీ ఔట్ లెట్ లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గుంటూరు జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థికభరోసా కల్పించేలా వారితో అరకు కాఫీ ఔట్ లెట్ లను ఏర్పాటు చేయించడానికి ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది.
గుంటూరు జిల్లాలో అరకు కాఫీ ఔట్ లెట్
ఉత్తరాంధ్ర గిరిజనుల అరకు కాఫీ ఇకపై గుంటూరు జిల్లాలో కూడా అందరికీ రుచి చూపించనుంది. డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటుగా గుంటూరు జిల్లాలో అరకు కాఫీ ఔట్ లెట్ లను ఏర్పాటు చేస్తున్నారు. తొలి దశలో ఎనిమిది ఔట్ లెట్ లను ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం డిఆర్డిఏ వెలుగు విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు.

త్వరలోనే అందుబాటులోకి అరకు కాఫీ ఔట్ లెట్స్
ప్రభుత్వ సహాయంతో పాటు అనుబంధ విభాగాల ద్వారా తోడ్పాటును అందించడానికి కృషి చేస్తున్నారు. ఉత్తరాంధ్రలోని గిరిజనులు సాగు చేసే అరకు కాఫీ దేశ విదేశాలలో పేరు ఉన్న విషయం తెలిసిందే. అరకు కాఫీని గుంటూరు జిల్లా వాసులకు కూడా పరిచయం చేయాలని భావించిన క్రమంలో ఈ ఔట్ లెట్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
తొలిదశలో ఆ ప్రాంతాలలో ఔట్ లెట్స్
తొలి దశలో ఎనిమిది ఔట్‌లెట్లు అమరావతి, తుళ్లూరు, తెనాలి, పొన్నూరు, గుంటూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. సహజంగా అరకు కాఫీ ఔట్ లెట్ ఏర్పాటు చేయాలంటే ఆరు లక్షల రూపాయల వ్యయం అవుతుంది. స్వయం సహాయక మహిళలు అంత మొత్తం సమకూర్చ లేని కారణంగా మూడున్నర లక్షల లోపే ఏర్పాటు చేసేలా ఔట్ లెట్ ఏర్పాటు చేసే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఒక్కో ఔట్‌లెట్‌కు రూ.3.50 లక్షల వ్యయం
దీంతో ఒక్కో ఔట్‌లెట్‌కు రూ.3.50 లక్షల వ్యయం అవుతుంది. దీనికోసం మహిళలకు రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. త్వరలోనే ఈ ఔట్ లెట్ లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఔట్ లెట్ లను ఏర్పాటు చేయడానికి ఉన్నతి పథకంలో మహిళలకు లక్ష రూపాయల వరకు రుణాన్ని మంజూరు చేస్తారు. మిగిలిన డబ్బు బ్యాంకు రుణాల ద్వారా అందిస్తారు.
సక్సెస్ అయితే మరిన్ని ఔట్ లెట్ల ఏర్పాటు
గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఏర్పాటు చేసే ఈ ఔట్ లెట్ లలో గిరిజన ఉత్పత్తులకు సంబంధించి ఇతర ప్రొడక్ట్స్ కూడా విక్రయించవచ్చు. వీటిని ఏర్పాటు చేసిన తర్వాత డిమాండ్ ను బట్టి ఇతర ప్రాంతాలలో కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు అధికారులు. వీటి ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక భరోసా అందించడమే కాకుండా అరకు కాఫీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచాలని భావిస్తున్నారు. అరకు కాఫీ రుచులను అందరూ ఆస్వాదించేలా చేయాలని సంకల్పించారు.












Click it and Unblock the Notifications