ఇంద్రకీలాద్రిపై ఈ సారి దసరా ప్రత్యేకంగా - అలంకారాలు, దర్శనాలు..!!
ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో 2025 దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ప్రతీ ఏటా ఇక్కడ దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సారి మరింత వైభవంగా నిర్వహించేందుకు నిర్ణయించారు. దసరా ఉత్సవాల క్యాలెండర్ తో పాటుగా అమ్మవారి అలంకారాల గురించి ఆలయ అధికారులు వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవ కాశం ఉండటంతో అవసరమైన ఏర్పాట్లు.. భక్తులకు సూచనలు చేస్తున్నారు.
ఈ ఏడాది కూడా దసరా మహోత్సవాలు ప్రతి ఏడాది లానే బ్రహ్మాండంగా నిర్వహిస్తాం ఆలయ ఈవో వెల్లడించారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం నగరోత్సవాలు జరుగుతాయని చెప్పారు. ఈ సారి మూలా నక్షత్రం 29 వ తేదీ సోమవారం వచ్చిందని వివరించారు. సెప్టెంబర్ 29వ తేదీ మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తార ని వెల్లడించారు. అక్టోబర్ 2 వ తేదీ గురువారం విజయదశమి రోజున ఉదయం మహా పూర్ణాహుతి, సాయంత్రం పవిత్ర కృష్ణా నదిలో తెప్పోత్సవం కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.

ఏర్పాట్ల కోసం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, దేవాదాయ శాఖ అధికారులతో కలిపి సమన్వయ సమావేశాన్ని రేపు (మంగళవారం) ఏర్పాటు చేసారు. సామాన్యులకు పెద్దపీట వేస్తూ అందరికీ దుర్గమ్మ దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఏడాది దసరా ఉత్స లు 11 రోజులు వచ్చాయి. 22వ తేదీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారం , 23వ తేదీ శ్రీ గాయత్రి దేవి అలకారం ఉంటుంది. అదే విధంగా 24వ తేదీ శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం , 25 వ తేదీ శ్రీ కాత్యాయిని దేవి అలంకారం ఉంటుందని వివరించారు. 26 వ తేదీ శ్రీ మహా లక్ష్మీ దేవి అలంకారం, 27 వ తేదీ శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం , 28 వ తేదీ శ్రీమహా చండీ దేవి అలంకారం లో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
కాగా, 29 తేదీ శ్రీ మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతి దేవి అలంకారం లో భక్తులకు దర్శనం ఇస్తారు. 30 వ తేదీ శ్రీ దుర్గా దేవి అలంకారం ఉంటుంది. 1వ తేదీ శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం ..ఇక, 2 వ తేదీ విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు అమ్మవారు ఆశీస్సులు అందించనున్నారు. 11 రోజులు 11 దివ్య అలంకారాల్లో దుర్గమ్మ భక్తుల కు దర్శనం ఇస్తారని.. ఈ సమయంలో అర్చక సభలు, వేద సభలు నిర్వహిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications