తెలంగాణలో మా ప్రభుత్వమే ఉంది: కళావెంకట్రావు సంచలనం, జగన్‌పై విసుర్లు
విజయనగరం: తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదని తమ ప్రభుత్వమేనంటూ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకునేలా వివరణ కూడా ఇచ్చుకోవడం విశేషం.
'తెలంగాణలో ఉన్నది మా ప్రభుత్వమే, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, అక్కడి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మా పార్టీ వారే, పార్టీ పేరు మాత్రమే మారింది, కానీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీయే' అంటూ వివరించారు.
ఆదివారం విజయనగరం పర్యటనకు వచ్చిన సందర్భంగా జిల్లా పరిషత్ అతిధిగృహంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రోజుకు 16 గంటలపాటు పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు.

మంత్రివర్గ సహచరుల పనితీరు సరిగా లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేయటాన్ని ప్రశ్నించగా.. కిమిడి సమాధానమిస్తూ మంత్రులు కూడా బాగానే పనిచేస్తున్నారన్నారు. మంత్రులు జిల్లాల పర్యటనకు ఎక్కువగా రాలేదంటే ప్యూయల్ ఖర్చులు తగ్గి రాష్ట్రానికి ఖర్చు తగ్గినట్లేగా అని ఛమత్కరించారు.
వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిడిపిలోకి చేర్చుకోవడాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు ఆదర్శంగా తీసుకుంటున్నారా? అని ప్రశ్నించగా 'తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉంది? ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, అక్కడి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మావారే, అక్కడ ఉంది మా ప్రభుత్వమే, కానీ పార్టీ పేరు మాత్రం మారింది' అని వ్యాఖ్యానించారు.
వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపును రాష్ట్భ్రావృద్ధి కోసం అందరినీ కలుపుకునే పోయే చర్య అని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాటతీరు, పనితీరు సరిగా లేక ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు దూరం అవుతున్నారన్నారు. పునర్విభజన చట్టం కింద రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు.
పెరిగిన స్థానాల్లో ముందునుంచి పార్టీలో పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు.
కిందిస్థాయి ఉద్యోగులకు జీతాలు పెంచడానికి డబ్బులు లేవంటున్న ప్రభుత్వం ఎమ్మెల్యేలకు భారీగా వేతనాలు పెంచటంపై స్పందిస్తూ ధరల సూచి ప్రకారం వేతనాల పెంపు జరిగిందన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షనాయకుడు ఏమి చెప్పారో తెలుసుకోవాలని సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications