పాలకొల్లులో ఈసారి ఎన్నికల్లో విజయం ఆయనదేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈసారి ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగానే మారాయి. ఈ క్రమంలో అధికార వైసిపి ప్రతిపక్ష టీడీపీ జనసేనల కూటమి ఏ ఒక్క నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో రాజకీయం ఏ విధంగా ఉంది? అక్కడ వచ్చే ఎన్నికలలో ఎవరికి విజయావకాశాలు ఉన్నాయి? అనే అంశాలు ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం నరసాపురం లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 1955లో జరిగిన తొలి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక ఆ తరువాత 1985 నుండి తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఆధిక్యాన్ని కొనసాగించింది. ప్రస్తుతం పాలకొల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుండి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికలలో 151 స్థానాలు గెలుచుకొని, వైసీపీ విజయకేతనం ఎగురవేసినప్పటికీ పాలకొల్లు నియోజకవర్గంలో మాత్రం టిడిపి హవా కొనసాగింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు పాలకొల్లుపై పట్టు కోసం వైసిపి తన శక్తి యుక్తులను ఉపయోగిస్తోంది. ఇక త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాలకొల్లు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఆర్థికంగా బాగా బలంగా ఉన్న గుడాల గోపిని రంగంలోకి దించారు.
గత అసెంబ్లీ ఎన్నికలలో డా. బాబ్జీని వైసిపి అభ్యర్థిగా నిలబెట్టినా, చివరి నిమిషంలో అభ్యర్థి ఎంపిక జరగడంతో ఆయన అక్కడ ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం గుడాల గోపి జగనన్నతో జనం గుడాల గోపన్నతో మనం కార్యక్రమం ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మళ్లీ వైసిపి ప్రభుత్వానికే పట్టం కట్టాలని ప్రచారాన్ని సాగిస్తున్నారు.
మరోవైపు తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా పాలకొల్లు నియోజకవర్గం నుంచి నిమ్మల రామానాయుడు మరోమారు రంగంలోకి దిగుతున్నారు. నిమ్మల రామానాయుడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి కావటం, ఎవరైనా ఎటువంటి సహాయం కావాలన్నా ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ అవ్వడం వంటి చర్యలతో ఆయనకు స్థానికంగా మంచి పేరుంది.
అయితే అధికార పార్టీలో లేకపోవడంతో నిమ్మల రామానాయుడు సమస్యలపై పోరాటం చేయడం తప్ప, నియోజకవర్గ అభివృద్ధికి పెద్దగా కృషి చేయలేకపోయారు అన్నది జరుగుతున్న చర్చ. స్థానికంగా ఆయనకు ఉన్న మంచి పేరు ప్లస్ అవుతుందని టిడిపి శ్రేణులు భావిస్తున్నారు. ఇక టిడిపి జనసేన బిజెపి కూటమిలో భాగంగా బరిలోకి దిగే ఆయనకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ధీమాతో ఉన్నారు. మరి వచ్చే ఎన్నికలలో పాలకొల్లు ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది ఆసక్తికరమే.












Click it and Unblock the Notifications