ఎదురు తిరిగిందా?: జగన్‌ను చిక్కుల్లోకి నెట్టిన పవన్ కల్యాణ్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిక్కుల్లోకి నెట్టినట్లే కనిపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని, ఈ విషయంలో జగన్ తొలుత చొరవ ప్రదర్శించాలని ఆయన అన్నారు.
గత కొద్ది రోజులుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విసురుతున్న సవాళ్లకు పవన్ కల్యాణ్ సోమవారం మీడియా సమావేశంలో చాలా క్లుప్తంగా సమాధానం చెప్పారు. తద్వారా జగన్‌ను కార్నర్ చేయడానికి ప్రయత్నించారు.

మేం సిద్ధమేనని జగన్...
మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి తాము సిద్ధమేనని జగన్ పవన్ కల్యాణ్‌కు ఆదివారం సమాధానమిచ్చారు. అయితే, మీ భాగస్వామి తెలుగుదేశం పార్టీ విషయం చెప్పాలని ఆయన అడిగారు. చంద్రబాాబును ఒప్పించాలని ఆయన అన్నారు. దానిపైనే ప్రధానంగా పవన్ కల్యాణ్ సోమవారం స్పందించారు.

టిడిపి విషయం చూద్దామని...
తాను టిడిపికి మద్దతు ఇస్తున్నట్లు వైసిపి నాయకులు చేసిన విమర్శలకు ఆయన జవాబిచ్చారు. జగన్ అవిశ్వాస తీర్మానం పెట్టి దాని ప్రయోజనం పొందాలని, టిడిపి వస్తుందా, రాదా అనేది చూద్దామని, టిడిపి రాకపోతే నష్టపోయేది ఆ పార్టీయేనని పవన్ కల్యాణ్ అనడం ద్వారా జగన్‌కు గట్టి సవాలే విసిరారు.

బాధ్యత తీసుకుంటానని పవన్ కల్యాణ్
జగన్ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే అఖిల పక్షం మద్దతు ఇచ్చే విధంగా చూస్తానని, ఇతర పార్టీల మద్దతును తానే కూడగడుతానని పవన్ కల్యాణ్ చెప్పారు. తద్వారా, తాను చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు వైసిపి చేస్తున్న విమర్శను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.

ఇది జగన్‌కు పరీక్షనా...
పవన్ కల్యాణ్ చేసిన సవాల్ వైయస్ జగన్‌కు సవాల్ విసిరినట్లే ఉంది. జగన్ ముందుకు రాకపోతే ఆయన బిజెపికి, ప్రధాని నరేంద్ర మోడీకి భయపడుతున్నారనే సంకేతాలు వెళ్తాయని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అదే విషయాన్ని ఆయన మీడియా సమావేశంలో మరో రకంగా చెప్పారు. అవిశ్వాసం ప్రతిపాదించి ధైర్యం ఉందని చాటుకోవాలని ఆయన అన్నారు.

జగన్‌కు ఎదురు తిరిగిందా...
పవన్ కల్యాణ్‌ను చిక్కుల్లో పడేయాలని వైయస్ జగన్ వ్యూహం ఎదురు తిరిగిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పవన్ కల్యాణ్ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి జగన్ వ్యూహాత్మకంగా మీరు మిత్రుడిని ఒప్పించడని అన్న మాటలను పవన్ కల్యాణ్ ధీటుగా సమాధానం ఇచ్చారు.












Click it and Unblock the Notifications