Pawan Kalyan: చిరంజీవి పుట్టినరోజున పవన్ స్పెషల్ విషెస్-దాన గుణాన్ని గుర్తుచేసుకుంటూ...!
టాలీవుడ్ మెగాస్టార్, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ పరిశ్రమతో పాటు రాజకీయ రంగంలోనూ పలువురు ఆయనకు ముందస్తు శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఇదే క్రమంలో చిరు సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్యకు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. అందులోనూ ఈసారి చిరంజీవి దాన గుణాన్ని కీర్తిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా ఉన్నాయి.
తన దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి అంటూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షల ప్రకటన మొదలుపెట్టారు. అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు అన్నారు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం తనకు తెలుసన్నారు. అనారోగ్యం బారినపడినవారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకమని వెల్లడించారు. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయన్నారు.

కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారని, అభ్యర్ధిస్తారని పవన్ తెలిపారు. ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నునిగా చేసిందేమో ! అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో అయిదు కోట్ల రూపాయల విరాళాన్ని జనసేనకు అందచేసి, విజయాన్ని అందుకోవాలని తమ ఇలవేలుపు ఆంజనేయుని సాక్షిగా చిరంజీవి ఆశీర్వదించారని గుర్తుచేసుకున్నారు.
ఆపద్బాంధవుడు అన్నయ్య
— JanaSena Party (@JanaSenaParty) August 22, 2024
నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి గారు. అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యం బారినపడినవారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య… pic.twitter.com/rNHfPWP03g
ఆయన ఆ రోజున ఇచ్చిన నైతిక బలం, నైతిక మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయన్నారు. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞుణ్ని అని పవన్ తెలిపారు. తల్లి లాంటి వదినమ్మతో ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుణ్ని మనసారా కోరుకుంటున్నట్లు పవన్ ముగించారు.












Click it and Unblock the Notifications