ఏపీలోనే పీకల్లోతు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్.. మరి తెలంగాణా సంగతేంటి?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రాజకీయాలు చేస్తానని చెప్పిన విషయం అందరికీ తెలుసు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం సమీపిస్తున్నా జనసేన పార్టీ ఏం చేయబోతుంది అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఏపీ రాజకీయాలలో పీకల లోతు మునిగిపోయిన పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలను మరిచిపోయారేమో అన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తం అవుతుంది.
నాలుగు మాసాల కిందట పవన్ కళ్యాణ్ మీరు కోరుకుంటే తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో 30 స్థానాలలో పోటీ చేస్తామని, పార్లమెంట్ స్థానాలలో పోటీ ఉంటుందని చెప్పారు. వారాహి వాహనానికి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సమయంలో అక్కడ నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో అదంతా నిజమే అని భావించిన జనసేన నేతలు రెట్టించిన ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ దూకుడు పెరిగితే ఆ పార్టీలోకి చేరాలని చూస్తున్న వారు కూడా లేకపోలేదు. అయితే ఏపీ పైనే ఫోకస్ పెడుతున్న పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ చేయడం లేదు అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నాయి.
ఒకరిని మించి ఒకరు పక్కా ప్లాన్ తో ప్రత్యర్ధి పార్టీలకు చెక్ పెట్టడానికి రచనలు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజలకు ఎన్నికల హామీల తాయిలాలు కూడా ఇప్పటినుంచి అందించే పనిలో పడ్డారు. అధికార బి ఆర్ ఎస్ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపిలు మాత్రమే కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బి ఎస్ పి వంటి పార్టీలు కూడా తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నాయి.
కానీ 30 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్ కళ్యాణ్ మాత్రం ఇదివరకు తెలంగాణపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తెలంగాణలో అసలు జనసేన పార్టీ పోటీ చేస్తుందా? జనసేన మీద ఆశలు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న వారి మాటేమిటి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఎలాంటి ప్రణాళిక లేకపోతే 30 స్థానాలలో పోటీ చేసినా డిపాజిట్లు కూడా రావని, అనవసరంగా పరువు పోగొట్టుకోవడమే అవుతుందని జనసేన పార్టీ తీరుపై పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సమయంలోనైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తారా? తెలంగాణ ఎన్నికల విసయంలో ఏం చెయ్యబోతున్నారు అన్నది క్లారిటీ ఇస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications