ఎన్డీయే భేటీ తర్వాత ఢిల్లీలోనే పవన్ ! టీడీపీతో పొత్తుపై బీజేపీ పెద్దలతో చర్చలు ?
ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై నిన్న ఎన్డీయే భేటీలోనే చర్చ జరుగుతుందని భావించినా అలా జరగలేదు. కేవలం జాతీయ అంశాలకే ఎన్డీయే భేటీ పరిమితం కావడంతో ఈ సమావేశంలో పాల్గొన్న తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలోనే ఉండిపోయారు. ఇవాళ బీజేపీ పెద్దల్ని కలిసి పొత్తుల అంశంపై చర్చించబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పొత్తులపై ఢిల్లీ నుంచే సంకేతాలు ఇచ్చిన పవన్.. ఇప్పుడు వాటికి వాస్తవరూపం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన కలిసే పోటీ చేస్తాయని భావిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ నిన్న స్పష్టం చేశారు. అయితే పొత్తుల విషయంలో కాస్త గ్యాప్ ఉందన్నారు. ఇప్పుడు అదే అంశంపై బీజేపీ పెద్దలతో చర్చించేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఎన్డీయే భేటీ ముగిశాక కూడా ఢిల్లీలోనే పవన్ ఉన్నారు. ఇవాళ బీజేపీ పెద్దల్ని కలిసేందుకు పవన్ అపాయింట్ మెంట్లు కోరినట్లు తెలుస్తోంది. వీటిలో ఏయే నేతల్ని కలవబోతున్నారనే అంశాల్ని జనసేన నేతలు రహస్యంగా ఉంచుతున్నారు.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేన-బీజేపీ ఇద్దరికీ కలిగే ప్రయోజనాన్ని కాషాయ పెద్దల దృష్టికి పవన్ తీసుకెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో బలమైన కూటమి ఏర్పాటు చేస్తానని ఎప్పటి నుంచో చెబుతున్న పవన్.. అది కుదరకపోతే ఏం జరగబోతోందో క్షేత్రస్ధాయి రిపోర్టులతో బీజేపీ పెద్దలకు వివరించేందుకు సిద్దమవుతున్నారు. గతంలోనూ బీజేపీ పెద్దల్ని ఓసారి కలిసిన తర్వాత అమిత్ షా-చంద్రబాబు భేటీ జరిగింది. అయితే పొత్తు విషయంలో టీడీపీ గతంతో పోలిస్తే అంత దూకుడుగా లేదు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలతో లింక్ లేకుండా ఏపీలో బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు పవన్ కళ్యాణ్ మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ముందు తెలంగాణలో తమతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ షరతు పెడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిస్ధితులే. కర్నాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభావం తగ్గి కాంగ్రెస్ బలపడుతున్న సంకేతాలున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీతో కలిసి వెళ్లే ప్రయోజనం ఉండదని టీడీపీ భావిస్తోంది. దీంతో తెలంగాణతో లింక్ లేకుండా ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ అడుగుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications