గురుజీ.. ఇక సర్దుకోండి!!
అమరావతి: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం.. బ్రో. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కింద టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మించారు. సముద్రఖని దర్శకుడు. ఈ సినిమా ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారానికి కేంద్రబిందువు అయింది.
గతంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చేసిన డాన్స్‌ను ఇందులో పేరడీగా పెట్టడం వివాదానికి దారి తీసింది. బ్రో సినిమాలో ఓ సీన్‌లో మంత్రి అంబటి రాంబాబును అనుకరిస్తూ కమేడియన్ పృథ్వీ డాన్స్ చేయడం, ఆయనపై పవన్ కల్యాణ్ సెటైర్లు వేయడం కలకలం రేపింది. వివాదాలకు దారి తీసింది.

దీనిపై అంబటి రాంబాబు ఇప్పటికే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సినిమాను సినిమాలాగే చూడాలంటూ విజ్ఞప్తి చేసిన బ్రో సినిమా హీరో సాయి ధరమ్ తేజ్‌పై విమర్శలు చేశారు. సినిమాలను సినిమాగానే తీయండి.. అప్పుడు సినిమాను సినిమాగా చూస్తారని ఎదురుదాడికి దిగారు. సినిమాల్లో రాజకీయ నాయకులను గోకడమెందుకు అంటూ నిలదీశారు.
ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే కమ్ మాటల రచయితగా పని చేసిన విషయం తెలిసిందే. అంబటి రాంబాబుకు పేరడీగా కమేడియన్ పృథ్వీతో డాన్స్ చేయించే స్పూఫ్‌ను ఉద్దేశపూరకంగానే త్రివిక్రమ్ ఇందులో జొప్పించారనేది టాక్. ప్రధాన కథతో పెద్దగా సంబంధం లేకపోయినప్పటికీ.. అంబటి రాంబాబును దృష్టిలో పెట్టుకుని ఈ సీన్‌ను పెట్టారని చెబుతున్నారు.
ఇది- రాజకీయంగా అనేక వివాదాలకు దారి తీసిన విషయం తెలిసిందే. పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉన్న పవన్ కల్యాణ్‌ను ఇబ్బందులకు గురి చేసిందని, దీనికి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిని కల్పించిందని అంటున్నారు. ఈ మొత్తం వివాదానికి త్రివిక్రమ్‌ను పవన్ కల్యాణ్ బాధ్యుడిని చేశారనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తెరపైనే కాకుండా నిజ జీవితంలో కూడా పవన్ కల్యాణ్‌కు సంబంధించిన రాజకీయ ప్రసంగాలను కూడా త్రివిక్రమే రాస్తాడనే పేరుంది. ఈ మధ్యకాలంలో అవి కూడా పక్కదారి పట్టినట్టుగా జనసేన వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ప్రత్యేకించి- డేటా చోరీ, వలంటీర్లపై చేసిన ఆరోపణలు.. ఇవన్నీ త్రివిక్రమ్ అనుభవలేమిని సూచించాయని భావిస్తోన్నాయి.
ఈ పరిణామాల మధ్య పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఎన్నికలు ముగిసేంత వరకూ త్రివిక్రమ్‌ను దూరం పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బ్రో వల్ల ఎదురైన డ్యామేజీని కొంతమేరకైనా కంట్రోల్ చేసుకోవాలనే అభిప్రాయంలో పవన్ కల్యాణ్ ఉన్నారని, రాజకీయంగా చెడ్డపేరు రాకుండా ఉండటానికి త్రివిక్రమ్‌ను దూరం పెట్టొచ్చని అంటున్నారు.












Click it and Unblock the Notifications