ఓజీ, ఓజీ అని మీద పడిపోతే ఎట్లా: మీకు దండం పెడతా: పని చేసుకోనివ్వండి: ఫ్యాన్స్‌పై పవన్ చిర్రుబుర్రు
Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లా పర్యటన సందర్భంగా అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఓజీ సినిమా విడుదల గురించి పలువురు ఫ్యాన్స్ ఆయనను ప్రశ్నించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. అభిమానులకు చురకలు అంటించారు.
అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఏజెన్సీ గ్రామాలను ఆయన సందర్శించారు. మట్టిరోడ్డుపై నడిచారు. ఒకవంక వర్షం పడుతున్నా లెక్కచేయలేదు. వర్షంలో తడుస్తూనే ఏజెన్సీ గ్రామాలకు వెళ్లారు. అక్కడివారితో ముఖాముఖి భేటీ అయ్యారు. వారు ఎదుర్కొంటోన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఇదివరకే మంజూరైన బాగుజోలు- సిరివరం రోడ్డు నిర్మాణ పనులను పవన్ కల్యాణ్ స్వయంగా పర్యవేక్షించారు. నిర్మాణ పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి రెండు నెలలకోసారి తానే స్వయంగా ఏజెన్సీ ఏరియాల్లో పర్యటిస్తానని మాటిచ్చారు. సకాలంలో రోడ్లు వేయిస్తానని చెప్పారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తన అభిమానులపై ఆగ్రహించారు. ఎక్కడికి వెళ్లినా మీద పడిపోతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. తనను పని చేసుకోనివ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. రోడ్డు నిర్మాణ పనులు ఎలా ఉన్నాయనేది కూడా చూడలేకపోతున్నానని పేర్కొన్నారు. తానొచ్చింది అభివృద్ధి పనుల గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవడానికేనని చెప్పారు.
అభిమానులు ఇలా మీద పడిపోతే పనులు జరగవని స్పష్టం చేశారు. దండం పెట్టాలనుకుంటున్నా.. రోడ్డు చూడనివ్వండంటూ అభ్యర్థించాల్సి వచ్చిందని పవన్ చెప్పారు. ఓజీ, ఓజీ, ఓజీ.. ఏంటిది? అని చురకలు అంటించారు. డిప్యూటీ సీఎం అయినందుకు ఆనందించండి..అని అన్నారు. డిప్యూటీ సీఎంగా తనను పని చేయనివ్వనిస్తే ఫ్యాన్స్ భవిష్యత్తుకే మంచిదని వ్యాఖ్యానించారు.
తెలుగు నేర్పించిన, వాడుక భాష నేర్పించిన, తిరుగుబాటు నేర్పించిన, దోపిడీని ఎదిరించిన నేలగా ఉత్తరాంధ్ర గురించి అభివర్ణించారు పవన్ కల్యాణ్. అలాంటి నేల మీది నుంచి వచ్చిన వాళ్లు సినిమాల మోజులో పడి, పోస్టర్లు పెట్టి, తనకో, మిగతా హీరోలకో జేజేలు కొడితే జీవితంలో ముందుకు వెళ్లలేరని హితబోధ చేశారు.
మాట్లాడితే మీసం తప్పమంటారు.. నేను మీసం తిప్పితే, ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవని పవన్ తేల్చి చెప్పారు. ప్రధానమంత్రిని కలిస్తేనో, లేక ముఖ్యమంత్రినో కలిసి ఫలానా సమస్య తీర్చాలని అడిగితేనే అవి పరిష్కారానికి నోచుకుంటాయని అన్నారు. తనకు పని చేయడం ఒక్కటే తెలుసునని, పని చేసుకోనివ్వండని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications