పిఠాపురంలో ఆ రైళ్ళు ఆగేలా, ట్రాఫిక్ సమస్య తీర్చేలా పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఓపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతూనే, మరోవైపు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఢిల్లీ వేదికగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో సమావేశమైన పవన్ కళ్యాణ్ పలు కీలక అభ్యర్థనలు చేశారు.
రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం పవన్ విజ్ఞప్తి
పిఠాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం, అలాగే పిఠాపురంలో పలు రైళ్లను నిలుపుదల చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో సామర్లకోట, ఉప్పాడ రోడ్డు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి లేకపోవడం వల్ల పిఠాపురం పట్టణ పరిధిలో ట్రాఫిక్ రద్దీ చోటు చేసుకుంటుందని ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

ట్రాఫిక్ తగ్గించేందుకు ఆర్వోబీ అవసరంపై పవన్ కళ్యాణ్
పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో అవసరమైన పలు రైల్వే ప్రాజెక్టుల పైన పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. పిఠాపురం పట్టణ పరిధిలో వివి సెక్షన్, సామర్లకోట - ఉప్పాడ రోడ్డులో, రైల్వే కిలోమీటర్ 6.40, 30 - 32 వద్ద లెవెల్ క్రాసింగ్ నెంబర్ 431 కి బదులుగా ఆర్వోబి అవసరమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని, ఇక్కడ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ఆర్వోబీ నిర్మాణం అవసరం అన్నారు.
పిఠాపురంలో పలు రైళ్లకు హాల్టింగ్ కోరిన పవన్ కళ్యాణ్
రోడ్డు కనెక్టివిటీని మెరుగుపరచడానికి, మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రధానమంత్రి గతి శక్తి ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. అలాగే పిఠాపురంలో పలు రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరుతూ శ్రీపాద శ్రీవల్లభ సంస్థానానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారని వారి సౌకర్యార్థం రైళ్లకు పిఠాపురంలో హాల్టింగ్ కల్పించాలని కోరారు.
ఈ ఎక్స్ ప్రెస్ ల హాల్టింగ్ కోసం పవన్ విజ్ఞప్తి
ముఖ్యంగా నాందేడ్ సంభల్ పూర్ నాగావళి, విశాఖపట్నం సాయి నగర్ షిరిడి ఎక్స్ప్రెస్, నాందేడ్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్ లను పిఠాపురంలో హాల్ట్ చేయాల్సిన అవసరం ఉందని, ఆయన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి విన్న కేంద్ర మంత్రి దీనిపైన ఆలోచిస్తామని పవన్ కళ్యాణ్ కు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications