అల్లు అర్జున్ కోసం రంగంలోకి పవన్-కాసేపట్లో హైదరాబాద్ కు ..!
పుష్ప 2 చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చావుకు కారణమయ్యారన్న ఆరోపణలపై హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు ఇవాళ అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. కొద్దిసేపటి క్రితం ఆయనకు నాంపల్లి కోర్టు రెండు వారాల రిమాండ్ కూడా విధించింది. ఈ నేపథ్యంలో ఆయనకు అండగా నిలిచేందుకు మెగా కుటుంబ సభ్యులంతా హైకోర్టు, నాంపల్లి కోర్టుతో పాటు ఆయన ఇంటికి కూడా వెళ్తున్నారు.

అల్లు అర్జున్ ను చిక్కడ పోలీసులు ఉదయం జూబ్లీహిల్స్ లోని ఇంట్లో అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయనతో పాటు పోలీసు స్టేషన్ కు వచ్చేందుకు తండ్రి అల్లు అరవింద్ బయలుదేరారు. అయితే అల్లు అర్జున్ ఆయన్ను వారించారు. ఏదైనా తాను చూసుకుంటానని చెప్పి పోలీసులతో వెళ్లిపోయారు. అనంతరం చిక్కడపల్లి పీఎస్ కు అల్లు అర్జున్ ను తరలించిన పోలీసులు.. అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు.
అయితే ఇదంతా జరుగుతుండగానే అల్లు అర్జున్ ఇంటికి మెగా హీరోలు క్యూ కట్టారు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అనంతరం చిరంజీవి సోదరుడు నాగబాబు కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. ఇప్పుడు మరో సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ బయలుదేరేందుకు సిద్దమవుతున్నారు. ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఆయన హైదరాబాద్ కు వెళ్లే అవకాశం ఉంది. అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పవన్ పరామర్శించే అవకాశముంది.












Click it and Unblock the Notifications