కాపులకు పెద్ద పరీక్షే పెట్టిన పవన్ ? సీఎం పదవి కామెంట్స్ పై లోలోపల...!
ఏపీలో కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ కు పూర్తిస్ధాయిలో అండగా నిలవడం లేదని గత ఎన్నికలు నిరూపించాయి. తాను ఎన్నో ఆశలు పెట్టుకుని పోటీ చేసిన రెండు కాపు సామాజిక వర్గ జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ ఓటమి పాలవ్వడంతో పవన్ కూడా అంతర్మథనంలో పడ్డారు. తనను తాను కాపులకు ప్రతినిధిగా భావించకుండా అన్ని వర్గాలు, మతాలు, కులాలు తనకు కావాలంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలు ఇన్నాళ్లూ తననే నమ్ముకున్న కాపుల్ని మధనంలోకి నెట్టాయి.
తాజాగా కాపులకు సీఎం పదవిపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీఎం పదవి ఇస్తామంటేనే పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ఆయన సొంత సామాజిక వర్గమైన కాపులు ఒత్తిడి పెంచుతున్నారు. వీరికి మాజీ మంత్రి హరిరామజోగయ్య వంటి వారు ఆజ్యం పోస్తున్నారు. దీంతో సీఎం పదవి ఇస్తామంటేనే పొత్తు ఉంటుందన్న వాదన అటు చంద్రబాబుకు వినిపించలేక,అలాగని సొంత సామాజిక వర్గాన్ని బుజ్జగించలేక పవన్ నలిగిపోతున్నారు. చివరికి ఏదైతే అది అయిందన్న భావనతో పవన్ కుండబద్దలు కొట్టేశారు.

తనకు ఊరికే సీఎం పదవి ఇచ్చేందుకు టీడీపీ కానీ, బీజేపీ కానీ సిద్దంగా లేవని పవన్ తేల్చిచెప్పేశారు. అలాగే తనకు కనీస సీట్లు లేకుండా సీఎం పదవి అడిగే పరిస్దితీ లేదని చెప్పేశారు. దీంతో పవన్ సీఎం పదవిపై ఆశ పెట్టుకోలేదన్న విషయం అందరికీ అర్ధమైంది. కానీ ఆయన్ను సీఎం చేయాలని భావిస్తున్న, ఒత్తిడి పెంచుతున్న కాపు సామాజిక వర్గం మాత్రం ఈ విషయంలో రాజీ పడేందుకు సిద్ధంగా లేదు. దీంతో పవన్ కామెంట్స్ పై వారిలో అంతర్మథనం సాగుతోంది.
సీఎం పదవి తీసుకోకుండా పవన్ టీడీపీకి మద్దతిస్తే జనసేనకు మద్దతివ్వలేక, అలాగని పవన్ ను కాదని ఇతర పార్టీలకు ఈసారి మద్దతివ్వలేక కాపు సామాజిక వర్గం మల్లగుల్లాలు పడుతోంది. కానీ పవన్ ఆలోచన మాత్రం వేరే ఉంది. తనకు అండగా ఉంటున్నామని చెప్పుకుంటున్న కాపు సామాజిక వర్గం ఎన్నికల్లో మాత్రం తనను గెలిపించుకోలేకపోయిందన్న ఆవేదన పవన్ లో చాలా ఉంది. అదే సమయంలో కాపుల్ని నమ్ముకుని ఇతర సామాజిక వర్గాల్ని విస్మరించిన ఫలితమే ఇదన్న భావన కూడా జనసేనానిలో పెరుగుతోంది. దీంతో తాజాగా సీఎం పదవి వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా అయినా కాపుల్లో పౌరుషం వచ్చి ముందు తనను గెలిపించి, ఆ తర్వాత సీఎం చేసే విషయంలో ఒత్తిడి చేస్తారన్న భావన పవన్ లో కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications