Pawan kalyan ప్రమాణస్వీకారంతో దద్దరిల్లిన సభాప్రాంగణం.. చిరంజీవి భావోద్వేగం, వేదికపై అపురూపఘట్టం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణంలోని వారంతా లేచి నిలుచుని చప్పట్లతో అభినందనలు తెలియజేశారు. జయజయ ధ్వానాలతో ప్రాంగణం మారుమోగిపోయేలా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ ప్రమాణం .. మార్మ్రోగిన సభా ప్రాంగణం
ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ కూడా ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంగా అవకాశం పక్కా అంటున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు గన్నవరంలోని కేసరపల్లిలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార సభా వేదికగా కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ప్రమాణస్వీకారం మొదలుపెట్టిన వెంటనే సభాప్రాంగణం అంతా మారుమోగిపోయింది.

అన్న చిరంజీవి కాళ్ళకు నమస్కరించిన పవన్ కళ్యాణ్
అక్కడి పరిసర ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి. పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని వేదికపై నుండి తిలకించిన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి పట్టరాని సంతోషంతో ఉక్కిరిబికిరయ్యారు . తన తమ్ముడి కష్టానికి తగిన ఫలితం దక్కిందని మెగాస్టార్ సంతోషించారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వేదికపై ఆసీనులైన అతిథులందరికీ నమస్కరించిన పవన్ కళ్యాణ్ తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి కాళ్లకు నమస్కరించి తన సంస్కారాన్ని తెలియజేశారు.
పవన్ కళ్యాణ్ ను గుండెలకు హత్తుకున్న చిరంజీవి
తన అన్న పట్ల తనకు ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ను చిరంజీవి ప్రేమగా దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకున్నారు. ఈ దృశ్యం ప్రతి ఒక్కరినీ ఉద్వేగానికి గురి చేసింది. రాజకీయాల్లో అడుగుపెట్టిన నాటినుండి పవన్ కళ్యాణ్ ఎన్నో కష్టనష్టాలను చవిచూసి ఫైనల్ గా మంత్రి కావడం ప్రతి ఒక్కరికి సంతోషం కలిగించింది.
తనను అవమానించిన వారికి సమాధానం చెప్పిన పవన్ కళ్యాణ్
ఒకప్పుడు ఎమ్మెల్యేగా అసెంబ్లీ గేటు కూడా తాకనీయబోమని పవన్ కళ్యాణ్ ను అవమానించిన వారందరికీ తాను సాధించిన విజయంతో సమాధానం చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సీజేఐ ఎన్వి రమణ తదితరులు అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు.
ఏళ్ళ తరబడి ఈ ఘట్టాన్ని చూడటానికి ఎదురు చూస్తున్న జనసైనికుల సంతోషం
ఇక ఏపీ రాజకీయాలలో తన పవర్ ను చూపించనున్నారు. ఈ ఘట్టాన్ని చూడడానికి సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం తో సంబరాలు జరుపుకుంటున్నారు వాడవాడలా ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అందరూ తిలకించేలా ఏర్పాట్లు చేసి వేడుకలు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications