ఒక్క నాగబాబుకు పదవి ! పవన్ ఎన్ని ప్రశ్నలు ఎదుర్కోవాలో తెలుసా ?
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తీవ్రంగా శ్రమించిన వారిలో జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు కూడా ఒకరు. ముఖ్యంగా మెగా కుటుంబ హీరోల్ని ఓవైపు, జబర్దస్త్ నటుల్ని మరోవైపు, సినీ పరిశ్రమలో చిన్నా చితకా యాక్టర్లను ఇంకోవైపు పట్టుకొచ్చి ఏపీలో కూటమికి అనుకూలంగా ఆయన చేయించిన ప్రచారం, సమన్వయం గెలుపులో కీలకమయ్యాయి. దీంతో కూటమి సర్కార్ ఆయన సేవల్ని గుర్తించి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించింది.
అయితే చంద్రబాబు ఎప్పుడైతే నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటన విడుదల చేశారో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులు, ఆయన గతంలో విమర్శించిన వారు కౌంటర్లు ప్రారంభించారు. దీనిపై నిన్న స్పందిస్తూ నాగబాబు తన సోదరుడు కాకపోయినా, తన కులం కాకపోయినా కూటమి విజయం కోసం పనిచేశారనే కారణంతో మంత్రి పదవి ఇచ్చేవాళ్లమని చెప్పుకున్నారు. ప్రస్తుతానికి పవన్ సమర్ధన సహేతుకంగానే కనిపిస్తున్నా భవిష్యత్తులో నాగబాబు మంత్రి అయ్యాక మాత్రం విమర్శల దాడి పెరగబోతోంది.

గతంలో కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాల్ని, వైఎస్ కుటుంబం వారసత్వ రాజకీయాల్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించారు. ఓ దశలో టీడీపీలో వారసత్వ రాజకీయాల్ని కూడా పవన్ తప్పుబట్టారు. వారసత్వ రాజకీయాలతో దేశానికి, రాష్ట్రానికి జరుగుతున్న నష్టం పదే పదే చెప్పారు. అయితే ఇప్పుడు నాగబాబు విషయంలో మాత్రం ఇది వారసత్వ రాజకీయం కాదని చెప్పుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. అయినా పవన్ ను పాత విమర్శలతో టార్గెట్ చేసేందుకు ప్రత్యర్థులు సిద్ధంగా ఉన్నారు.
గతంలో కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ మీద పవన్ వారసత్వ రాజకీయాల విమర్శలు చేసినప్పుడు మీరు మాత్రం చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇవ్వలేదా అంటూ కౌంటర్లు పడ్డాయి. ఇప్పుడు మరోసారి పవన్ పై అదే విమర్శలు కాస్త అటు ఇటుగా సంధించేందుకు ప్రత్యర్థులు సిద్దమవుతున్నారు. దీనికి తోడు సోదరుడు నాగబాబుకు మంత్రి వారసత్వ రాజకీయాల కోటాలోకి రాదా అన్న ప్రశ్న సంధించబోతున్నారు. దీంతో నాగబాబుకు మంత్రి పదవిని సమర్ధించునే విషయంలో పవన్ తో పాటు చంద్రబాబుకు, ఇతర కూటమి నేతలకు చిక్కులు తప్పేలా లేవు. అలాగే కాంగ్రెస్, వైసీపీ వారసత్వ రాజకీయాల్ని విమర్శించే అవకాశం కూడా వీరికి లేకుండా పోతోంది.












Click it and Unblock the Notifications