ఇంకా ఎంతకాలం?..ఎక్కడ వైఫల్యం చెందాం?
Pawan Kalyan: కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నెలో ఓ చిన్నారిపై జరిగిన అత్యాచారం- హత్యోదంతంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
కడప జిల్లా మైలవరం మండలంలో కంబాలదిన్నె గ్రామంలో ఇటీవలే మూడేళ్ల బాలికపై మోరగుడికి చెందిన దూదేకుల రహ్మతుల్లా అనే యువకుడు మద్యం మత్తులో అత్యాచారానికి ఒడిగట్టిన విషయం తెలిసిందే. ఈ ఘాతుకం బయటికి రాకూడదనే కారణంతో బాలికను దారుణంగా హత్య చేశాడు.

ఈ ఘటన పట్ల పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. చిన్నారులపై అఘాయిత్యాలు ఇంకా ఎంతకాలం? అంటూ ప్రశ్నించారు. యావత్ సమాజం తలదించుకునే ఆకృత్యానికి పాల్పడిన నరరూప మృగాళ్ళను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
నాలుగు రోజుల క్రితం వైఎస్ఆర్ కడప జిల్లా, మైలవరం మండలం, కంబాలదిన్నె గ్రామంలో అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడికట్టి, హత్య చెయ్యడం, అది కూడా బందువులకు సంబంధించిన వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడటం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటనగా భావిస్తున్నానని పవన్ పేర్కొన్నారు.
ఈ వార్త తన హృదయాన్ని కకావికాలం చేసిందని అన్నారు. సమాజంగా మనం ఎక్కడ వైఫల్యం చెందాం? అనే ప్రశ్న ఈ రోజు మన ముందు ఉందని చెప్పారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా అధికారులను అడిగి తెలుసుకున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
గతంలో కథువలో ఆసిఫా అనే చిన్నారిపై దారుణమైన అఘాయిత్యానికి పాల్పడి చంపేసినప్పుడు రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేసి, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకూడదు అని తాను కోరుకున్నానని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. అయినా ఇలాంటివి జరుగుతున్నాయంటే- చట్టం నుండి తప్పించుకోవచ్చు అనే భావన నిందితుల్లో నెలకొని ఉండటం కారణం కావొచ్చని చెప్పారు.
ఈ ఘటనకు పాల్పడిన కిరాతకుడిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారని వివరించారు. నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడాలంటే భయం పుట్టేలా ఉండాలని న్యాయ, పోలీస్ శాఖ, ఏపీ డీజీపీ, హో మ్ శాఖ మంత్రి వంగలపూడి అనితకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.
బాలిక కుటుంబానికి ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నిందితులకు శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలియజేస్తున్నాననని అన్నారు.












Click it and Unblock the Notifications