ఐదుసార్లు నువ్వే సీఎం-నేను చూడాలి-పవన్ తో నాగేశ్వరమ్మ భావోద్వేగం..!
జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామానికి వెళ్లారు. గతంలో విపక్షంలో ఉండగా.. ఇక్కడ జనసేన కార్యకర్తల ఇళ్లను రోడ్డు విస్తరణ పేరుతో కూల్చేయడంతో అప్పట్లో వెళ్లి ధైర్యం చెప్పిన పవన్.. మళ్లీ వస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఇవాళ ఇప్పటం గ్రామానికి వెళ్లిన పవన్ స్థానికంగా వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఎమోషనల్ దృశ్యాలు కనిపించాయి.
గతంలో వైసీపీ హయాంలో ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో స్ధానిక జనసేన కార్యకర్తల ఇళ్ల ప్రహరీలను కూల్చేసారు. దీంతో పవన్ అక్కడికి వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. అలాగే ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలి ఇల్లు కూడా దెబ్బతినడంతో ఆ తర్వాత ఆమె కొత్త ఇల్లు కట్టుకుంది. దీంతో ఆమె ఇంటికి వస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఇన్నాళ్లకు పవన్ అక్కడికి వెళ్లారు. దీంతో ఇండ్ల నాగేశ్వరమ్మ పవన్ ను హత్తుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

పవన్ కళ్యాణ్ తో నువ్వు ఐదు సార్లు సీఎం కావాలి.. అది నేను చూడాలి అంటూ ఇండ్ల నాగేశ్వరమ్మ కోరారు. అనంతరం ఇండ్ల నాగేశ్వరమ్మకు పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేశారు. అలాగే నాగేశ్వరమ్మకు రూ.50 వేలు, మనవడికి రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇండ్ల నాగేశ్వరమ్మను పవన్ కలిసేందుకు రావడంతో గ్రామం అంతా అక్కడికి తరలివచ్చింది. పవన్ ను చూసేందుకు గ్రామస్థులు ఎగబడ్డారు. గతానికీ, ఇప్పటికీ మారిన పరిస్ధితులు, కూటమి సర్కార్ లో తమ పరిస్ధితి ఎలా ఉందన్న విషయాలను పవన్ తో వారు పంచుకున్నారు. దీంతో పవన్ కూడా వారు చెప్పిన విషయాన్ని సావధానంగా విన్నారు.












Click it and Unblock the Notifications