ఏపీలో పట్టణ ప్రాంతాలలో ఇల్లులేని వారికి తీపికబురు.. ఇక మొదలెట్టండి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు అందించటం కోసం పీఎంఏవై అర్బన్, పీఎంఏవై రూరల్ క్రింద కేంద్రాన్ని సహకారం అందించాలని కోరింది కూటమి సర్కార్. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుంది అని సంతోషపడిన వేళ ఏపీలో పట్టణ ప్రాంత ఇళ్ళు లేని నిరుపేదలకు కేంద్రం శుభవార్త చెప్పింది.
కొత్తగా 17,912 ఇళ్ళకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పీఎంఏవై అర్బన్-2.0 పథకం కింద రాష్ట్రానికి కొత్తగా 17,912 ఇళ్ళకు కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలి విడతగా రాష్ట్రవ్యాప్తంగా 17,912 గృహాల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించి రూ.447.80 కోట్లు విడుదల చేయడానికి పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి.

ఒక్కో లబ్ధిదారుకు రూ.2.89లక్షల ఆర్థిక సాయం
ప్రతి ఇంటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.2.50లక్షలు అందిస్తాయి. కేంద్రం రూ.1.50లక్షలు, రాష్ట్రం రూ.1 లక్ష వాటా వేస్తాయి. ఇందులో వీబీ జీరాంజీ కింద రూ.27 వేలు, స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12వేలు అదనంగా లభిస్తాయి. మొత్తంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.2.89లక్షల ఆర్థిక సాయం అందనుంది. ఇకపై కేంద్రం మంజూరు చేసే ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు కేటాయించనుంది.
17,912 గృహాలకు సంబంధించి జిల్లాల వారీగా కేటాయింపులు
ఈ మేరకు జిల్లాల వారీగా కేటాయింపులు జరిగాయి. మొత్తం 17,912 గృహాల్లో 15,793 ఇళ్లు పట్టణ స్థానిక సంస్థల యూఎల్‌బీ పరిధిలోనూ, 2,119 ఇళ్లు పట్టణాభివృద్ధి సంస్థల యూడీఏ పరిధిలోనూ ఉన్నాయి. అనంతపురం జిల్లాకు అత్యధికంగా 1,387 గృహాలు కేటాయించగా, పల్నాడు 1,229, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 1,057, వైఎస్సార్ కడప 1,053 గృహాలు వచ్చాయి.
ఆర్థిక సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ
పశ్చిమ గోదావరి జిల్లాకు అత్యల్పంగా 212 ఇళ్లు మంజూరయ్యాయి. జిల్లా కలెక్టర్లు నిర్మాణ అనుమతులు ఇస్తారు. ఇంటి కార్పెట్ ఏరియా కనీసం 30 చ.మీ., గరిష్ఠంగా 45 చ.మీ. ఉండాలి. ప్రభుత్వం నమూనా డిజైన్లు అందుబాటులో ఉంచుతుంది. లబ్ధిదారులు స్థల పరిస్థితులకు అనుగుణంగా ఎంచుకోవచ్చు. ఆర్థిక సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. అయితే నిబంధనల ప్రకారం నిర్మాణం చేసిన వారికే ఇది వర్తిస్తుంది.













Click it and Unblock the Notifications