kova Bun Controversy: స్పందించిన పరిటాల శ్రీరామ్, వలీకి రాజకీయ మద్దతు
మేడారం జాతర సందడి మధ్య ఓ చిన్న కోవా బన్ స్టాల్... కానీ అక్కడ ప్రారంభమైన వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. కేవలం రూ.10కే కోవా బన్ అమ్ముతున్న వలీ అనే చిరు వ్యాపారిని ఓ యూట్యూబ్ ఛానల్ టార్గెట్ చేయడంతో కథ మలుపు తిరిగింది. "ఇంత తక్కువ ధరకి ఎలా ఇస్తావు? ఏదైనా కలిపావా?" అంటూ అనుమానాల వర్షం కురిపించడమే కాకుండా, మతం రంగు పులిమి విమర్శించడం పలువురిని ఆగ్రహానికి గురిచేసింది.
కష్టపడి సంపాదించే ఒక చిన్న వ్యాపారిని ప్రోత్సహించాల్సింది పోయి... వ్యూస్, లైక్స్ కోసం అతడిని బహిరంగంగా ప్రశ్నించడం, అతని గౌరవాన్ని దెబ్బతీయడం సరైందా? అనే ప్రశ్న నెటిజన్లను కదిలించింది. ఈ వ్యాఖ్యలు కేవలం వలీని మాత్రమే కాదు, తక్కువ లాభంతో నిజాయితీగా జీవనం సాగించే శ్రమజీవులందరినీ అవమానించడమేనని సోషల్ మీడియాలో వాదనలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉండగా, రాజకీయ వర్గాలు కూడా స్పందించాయి. మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు, ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. "ఆకలికి కులం ఉండదు... ఆత్మగౌరవానికి మతం ఉండదు. కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించుకునే ప్రతి ఒక్కరినీ గౌరవించాల్సిన బాధ్యత అందరిదీ. ఒక కోవా బన్ అమ్ముకునే పేద వ్యాపారి జీవితాన్ని ఇలా రోడ్డుపైకి లాగడం దారుణం. యూట్యూబ్ వ్యూస్ కోసం ఇలాంటి పనులు చేయడం తగదు. పేదవారి పక్షాన నిలబడాలి గానీ గొంతు నొక్కడం కాదు" అంటూ ఆయన ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో వలీకి లభిస్తున్న మద్దతు మానవత్వం ఇంకా బతికే ఉందని సూచిస్తోందని కూడా వ్యాఖ్యానించారు.
ఆకలికి కులం ఉండదు, ఆత్మగౌరవానికి మతం ఉండదు. కష్టపడి పనిచేసుకొని కుటుంబాన్ని పోషించుకునే ప్రతీ ఒక్కరినీ గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. ఒక కోవ బన్ విక్రయించుకునే పేద చిరు వ్యాపారి జీవితాన్ని ఇలా రోడ్డుపైకి లాగడం దారుణం. యూట్యూబ్లో వ్యూస్, లైక్స్ కోసం కొంద… pic.twitter.com/2bammWbuTe
— Paritala Sreeram (@IParitalaSriram) February 13, 2026
అదే సమయంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కూడా వలీకి అండగా నిలిచారు. తక్కువ ధరకు నాణ్యమైన ఆహారం అందించాలనే ప్రయత్నాన్ని అభినందిస్తూ, మతం, అనుమానాల పేరుతో చిన్న వ్యాపారులను వేధించడం సరికాదని ఆమె స్పష్టం చేశారు.
"ఆకలికి కులం ఉండదు… ఆత్మగౌరవానికి మతం ఉండదు…కష్టానికి పార్టీ రంగు ఉండదు!"
— Dr.Byreddy Shabari (@ByreddyShabari) February 13, 2026
ఈరోజు సోషల్ మీడియాలో తిరుగుతున్నది ఒక వార్త కాదు… ఒక కుటుంబపు బరువు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడటం సులువు. కానీ ఆ వ్యక్తి వెనక ఉన్న బాధను చూడడానికి సహాయం చేయడానికి ధైర్యం కావాలి. నిజ నిజాలు… pic.twitter.com/2VMJ9cmwLd
మొత్తానికి, మేడారం జాతరలో ప్రారంభమైన ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. వివక్షను తిప్పికొడుతూ, కులమతాలకు అతీతంగా వలీకి అండగా నిలుస్తున్న నెటిజన్లు... "ఆకలి ముందు మనం అందరం ఒక్కటే" అనే సందేశాన్ని గట్టిగా వినిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications