డ్రగ్స్ కేసు: పోలీస్ కస్టడీలో కబాలి నిర్మాత కేపీ చౌదరి; ఆ సెలబ్రిటీలకు టెన్షన్!!
డ్రగ్స్ కేసులో కొకైన్ తో పట్టుబడిన కబాలి నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్ తరలిస్తూ కేపీ చౌదరి పోలీసులకు పట్టుబడ్డారు. కేపీ చౌదరిని అరెస్టు చేసిన తర్వాత ఆయనను కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
చర్లపల్లి జైలులో ఉన్న కేపీ చౌదరిని పోలీసులు రెండు రోజుల విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకోవడంతో ఆయనతో సంబంధాలు ఉన్న పలువురు సెలబ్రిటీలకు వణుకు మొదలైంది. 14 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా చర్లపల్లి జైల్లో ఉన్న కేపీ చౌదరిని ఉప్పరపల్లి కోర్టు పోలీసుల కస్టడీకి ఇవ్వడానికి అనుమతినిచ్చింది. దీంతో పోలీసులు కేపీ చౌదరిని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈరోజు, రేపు కె.పి చౌదరిని విచారించనున్నారు.

గోవా నుండి 100 కొకైన్ ప్యాకెట్లను తెచ్చిన కెపి చౌదరి వద్ద 90 ప్యాకెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, పది ప్యాకెట్లు ఎవరికి అమ్మారు అన్న దానిపైన ఆరా తీస్తున్నారు. టాలీవుడ్ సినీప్రముఖులతో కెపి చౌదరి సంబంధాలపై పోలీసులు లోతుగా ఆరా తీయనున్నారు. ఇప్పటికే కెపి చౌదరి వద్ద ఉన్న నాలుగు సెల్ఫోన్లతో పాటు ల్యాప్ టాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలోని డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి కేపీ చౌదరి డ్రగ్స్ దందా చేస్తున్నట్టు వెల్లడించిన పోలీసులు కేపీ చౌదరికి చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు టచ్లో ఉన్నారని గుర్తించారు. ఈ మేరకు కేపీ చౌదరితో ఉన్న డ్రగ్స్ లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అతని మొబైల్ ఫోన్ డేటా ఆధారంగా ఎవరెవరు అతనితో చాటింగ్ చేశారు అన్నదానిపై పోలీసులు వివరాలు సేకరించి విశ్లేషిస్తున్నారు.

రోషన్ అనే డ్రగ్స్ పెడ్లర్ ను విచారించిన క్రమంలో నిర్మాత కెపి చౌదరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గోవా, హైదరాబాద్ లో ప్రైవేటు పార్టీలు నిర్వహించిన కె పి చౌదరి పార్టీలకు వెళ్లిన సెలబ్రిటీలు ఎవరన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు, నలుగురు మహిళా ఆర్టిస్టులు ఒక డైరెక్టర్ తో కేపీ చౌదరి డ్రగ్స్ చాట్ ను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో కేపీ చౌదరిని పోలీసులు కస్టడీకి తీసుకోవడంతో పలువురు సెలబ్రిటీల లో గుబులు నెలకొంది.












Click it and Unblock the Notifications