దీపం ఉండగానే ఇల్లు దిద్దుకునే పనిలో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి!!
బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టిన దగ్గుబాటి పురందేశ్వరి ఒకపక్క పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాడిలో పెట్టడంతో పాటు, మరోవైపు తన రాజకీయ భవితవ్యం పైన కూడా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్న చిన్నమ్మ తనకు అనుకూలంగా ఉండే నియోజక వర్గాలను జల్లెడ పడుతున్నట్టు సమాచారం.
ఇప్పటివరకు పార్లమెంటు రాజకీయాలకే పరిమితమైన దగ్గుబాటి పురందేశ్వరి, ఈసారి అసెంబ్లీ వైపు చూడడం రాష్ట్ర రాజకీయాల్లోనూ, బిజెపి లోనూ ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలోకి వచ్చిన దగ్గుపాటి పురందేశ్వరి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే కేంద్ర మంత్రి గా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాజంపేట నియోజకవర్గం నుండి 2014ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

2019 ఎన్నికలలో విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేసి పురందేశ్వరి ఓడిపోయారు. అయితే ఈసారి మాత్రం ఆమె తన దృష్టిని అసెంబ్లీ నియోజకవర్గాల పైనే ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో అసెంబ్లీ నియోజకవర్గం నుండి పురందేశ్వరి బరిలోకి దిగడానికి కావలసిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నట్టు బీజేపీ నేతల మధ్య చర్చ సాగుతుంది.
వచ్చే ఎన్నికలలో ఏపీలో పోటీ తీవ్రంగా ఉండే నేపథ్యంలో పార్లమెంటు నియోజకవర్గం నుండి కాకుండా, అసెంబ్లీ నియోజకవర్గం నుండి పురందేశ్వరి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎన్నికలలో రాజంపేట లేదా పరుచూరు నుండి పురందేశ్వరి పోటీ చేసే అవకాశం ఉందని, లేదా రెండు నియోజకవర్గాల నుండి ఆమె ఎన్నికల బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
గతంలోలా పార్లమెంటుకు కాకుండా, అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తానని పురందేశ్వరి నమ్మకంతో ఉన్నారని సమాచారం. పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తే దాదాపు ఏడు నియోజకవర్గాల ఖర్చు భరించాల్సి ఉంటుందని, అలాకాకుండా అసెంబ్లీకి పోటీ చేయడం వల్ల ఖర్చు తగ్గుతుందని, అలాగే గెలిస్తే ఏపీలో రాజకీయాలలో చక్రం తిప్పడానికి అవకాశం ఉంటుందని పురందేశ్వరి భావిస్తున్నారని సమాచారం.
వచ్చే ఎన్నికలలో కూడా పురందేశ్వరి ఓటమి పాలైతే ఆమె రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని, అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు దిద్దుకోవాలన్న చందంగా పురందేశ్వరి ప్లాన్ మార్చినట్టు చర్చ జరుగుతుంది. మరి పురందేశ్వరి ప్లాన్ వర్కవుట్ అవుతుందా? అధిష్టానం ఆమెను అసెంబ్లీ బరిలో దించుతుందా? తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications