ఏపీ నూతన డీజీపీ నేడు బాధ్యతల స్వీకరణ - కడప నుంచి పోలీస్ బాస్ దాకా..!!
ఏపీ నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాద్ రెడ్డి ఈ రోజు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ను ఆకస్మికంగా బదిలీ చేసిన ప్రభుత్వం ఆ స్థానంలో రాజేంద్ర నాధ్ రెడ్డికి కొత్తగా డీజీపీ బాధ్యతలు అప్పగించింది. ఈ రోజు సవాంగ్ నుంచి కొత్త డీజీపీ బాధ్యతలు స్వీకరించనున్నారు. మంగళగిరిలోని ఆరో బెటాలియన్‌లో గౌతం సవాంగ్‌కు ఫేర్‌వెల్ కార్యక్రమం జరగనుంది. అనంతరం పోలీసు ప్రధాన కార్యాలయంలో రాజేంద్రనాధ్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు.

కడప జిల్లా నుంచి డీజీపీ దాకా
కడప జిల్లాకు చెందిన రాజేంద్రనాధ్ రెడ్డి 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. కడప జిల్లా రాజుపాలెం మండలంలోని పర్లపాడు ఆయన స్వగ్రామం. 1994లో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఏఎస్పీగా మొదటి పోస్టింగ్‌లో బాధ్యతలు చేపట్టారు. 1996లో వరంగల్ జిల్లా జనగాంలో ఏఎస్పీగా, అనంతరం వరంగల్ ఏఎస్పీగానూ పని చేశారు. 1996-97 వరకు కరీంనగర్లో ఆపరేషన్స్ ఏఎస్పీగా విధులు నిర్వర్తించారు. 1997-99లో విశాఖ రూరల్ ఎస్పీగా అనంతరం సీఐడీ ఎస్పీ, గుంతకల్లు రైల్వే ఎస్పీ, విజయవాడ రైల్వే ఎస్పీగా రాజేంద్రనాథ్ రెడ్డి పని చేశారు.

పలు హోదాల్లో అనేక ప్రాంతాల్లో
అక్కడ నుంచి నెల్లూరు ఎస్పీ, హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా విధులు నిర్వర్తించారు. 2006-08 వరకు ఎక్సైజ్ శాఖలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. 2008-10 వరకు విజయవాడ సీపీ, 2010-11 వరకు ఎన్ఫోర్స్మెంట్ డీఐజీ, ఐజీగా విధులు చేపట్టారు.
2011-13 వరకు నార్త్ కోస్టల్ ఐజీగా, 2013-14 వరకు హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీగా, 2015-17 వరకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా పని చేశారు.2018-19 వరకు డ్రగ్ కంట్రోల్ డీజీగా బాధ్యతలు చేపట్టారు. 2019-20 వరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా.. 2020 నుంచి ఇంటెలిజెన్స్ డీజీగా అదనపు బాధ్యతలు చేపట్టారు.

సీఎం జగన్ ఏరి కోరి బాధ్యతలు
తాజాగా డీజీపీగా అదనపు బాధ్యతలను ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో రాజేంద్రనాద్ సమర్ధతకు డీజీపీ బాధ్యతలు పరీక్షగా మారనున్నాయి. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాజేంద్రనాధ్ రెడ్డి సీఎంను కలవనున్నారు. అయితే, ఇదే సమయంలో ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల బదిలీల పైన కసరత్తు చేస్తోంది.
రాజేంద్రనాద్ ను డిజీపీగా నియమించటంతో ఇంటలిజెన్స్ కు నూతన చీఫ్ ను నియమించా ల్సి ఉంది. అదే విధంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సమయం సమీపిస్తుండటంతో పలు విభాగాల చీఫ్ ల మార్పుతో పాటుగా జిల్లాల అధికారుల బదిలీలు ఉంటాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications