క్యాంప్ కార్యాలయానికి ఫోన్ చేసిన ఎమ్మెల్యే?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సీనియర్ నేతలు బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 150 మంది ఎమ్మెల్యేల్లో ఎవరు బాగా పనిచేస్తున్నారు? ఎవరు పనితీరులో వెనకబడ్డారు? వారిని హెచ్చరించి మళ్లీ గాడిన పడేయడం.. నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాల ప్రచారం.. ఎవరైనా గ్రూపు రాజకీయాలు చేస్తున్నారా? ఎవరికి మంచి పేరు ఉంది? రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాలు ఎవరు? తదితర విషయాలపై విశ్లేషణ జరుగుతుంటుంది.

రాయలసీమకు చెందిన ఒక ఎమ్మెల్యే
ఎమ్మెల్యేలను సలహాదారులు సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ కు మంచిపేరు తీసుకువచ్చేలా చూస్తుంటారు. అయితే రాయలసీమకు చెందిన ఒక ఎమ్మెల్యేపై నియోజకవర్గంలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు అధిష్టానం గుర్తించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న సదరు ఎమ్మెల్యే పార్టీలోని నాయకులను కలుపుకోకుండా ఒంటెత్తు పోకడలకు పోతున్నారనేది ప్రధాన ఆరోపణగా ఉంది. ఆయనపై పార్టీ నేతలు తాడేపల్లి వరకు వచ్చి పలుమార్లు ఫిర్యాదులు చేశారు. గతంలో అనేకసార్లు అధిష్టానం ఆయన్ను హెచ్చరించింది.

స్పష్టమైన హామీ లభించలేదు
ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో చేపట్టిన పనులను ఎప్పటికప్పుడు అధిష్టానానికి తెలియజేస్తుండాలి. ఈ క్రమంలో సదరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి పనిచేసి సంబంధిత ఇన్ఛార్జితో మాట్లాడారు. మంచి కార్యక్రమాలు చేపడుతున్నానని, రాబోయే ఎన్నికల్లో కూడా సీటు తనకే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో చేపడుతున్న పనులకు సంబంధించి సీడీ కూడా పంపించానని చెప్పారు. అయితే ఆయనకు సీనియర్ నేతల నుంచి హామీ లభించలేదు.

మారకపోతే వైసీపీవారే ఓడిస్తారు..
.
సీటు సంగతి తర్వాత.. ముందు నియోజకవర్గంలో నేతలను కలుపుకొని పనిచేయాలని, ఇప్పుడు సీటిస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీవారు మిమ్మల్ని ఓడించరని, వైసీపీ వారే ఓడిస్తారని, అటువంటి సాహసాలు పార్టీ చేయదని ఖరాఖండిగా చెప్పేశారు. అతనిపై వస్తున్న ఆరోపణల చిట్టాను కూడా చెప్పేసరికి ఆ ఎమ్మెల్యే అటువంటిదేమీ లేదని, తానంటే గిట్టనివారు అలా చేస్తున్నారని గట్టిగా చెప్పినప్పటికీ పార్టీ చేయించిన సర్వేలోను మైనస్ మార్కులు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రవర్తన మార్చుకొని వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని మార్చాల్సి ఉంటుందని చెప్పడంతో నేతలందరినీ కలుపుకుపోయే పనికి ఆ ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు.












Click it and Unblock the Notifications