బీజేపీ ,పవన్ పొత్తుతో ఏపీలో కొత్త లెక్కలు - రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!
టీపీసీసీ చీఫ్ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో అధికారం పైన ధీమా వ్యక్తం చేసిన రేవంత్ ఏపీ రాజకీయాల పైనా స్పందించారు. తెలంగాణలో బీజేపీ - జనసేన పొత్తుతో ఒక ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఏపీలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే అంశం పైన స్పందించారు. చంద్రబాబు జైలుకెళ్లటం రైటా రాంగా అని తాను చెప్పలేనంటూ ఆసక్తి పెంచారు. చంద్రబాబు అరెస్ట్ పై వ్యక్తిగతంగా బాధ పడుతున్నానని రేవంత్ చెప్పుకొచ్చారు.
హోరా హోరీగా: తెలంగాణలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. కాంగ్రెస్ గెలుపు ఖాయమనే ధీమాతో ఉంది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు..డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఒక ఇంటర్వ్యూలో రేవంత్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు గురించి ఆసక్తి కర విశ్లేషణ చేసారు.

తానే సీఎం అని హైకమాండ్ చెప్పలేదని చెబుతూనే.. డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం గురించి స్పష్టత ఇచ్చారు. ఇక, ఇదే సమయంలో ఏపీ రాజకీయాల గురించి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబుతో తనకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందని.. ఆయన జైలుకు వెళ్లటం పర్సనల్‌గా బాధించిందన్నారు. రాజకీయంగా ఈ వ్యవహారం లాభం కోణంలో ఆలోచన చేయటం లేదన్నారు.
పొత్తులు - ఓట్లుతో: ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన తెలంగాణలో బీజేపీతో బరిలోకి దిగటంతో ఒక ప్రమాదం ఉందన్నారు. తెలంగాణలో జనసేనకు ఓట్లు రాకపోతే ఆ ప్రభావం ఏపీలో పడుతుందని ఆసక్తి కర విశ్లేషణ చేసారు. తెలంగాణలో బీజేపీకి పవన్ మద్దతుగా నిలుస్తూ..ఏపీలో బీజేపీ సహకారం తీసుకోవాలనే వ్యూహంతో పవన్ ముందుకు వెళ్తున్నారు. బీజేపీతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఏపీ భవిష్యత్ రాజకీయం కోసం టీడీపీ తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది.
ఈ సమయంలో టీడీపీ మద్దతు ఓటింగ్ కాంగ్రెస్ కు మళ్లుతుందనే ప్రచారం సాగుతోంది. పవన్ ద్వారా తమకు అనుకూలంగా మలచుకోవాలనేది బీజేపీ వ్యూహం. కానీ, టీడీపీ మద్దతు ఓట్లు జనసేనకు కాకుండా..కాంగ్రెస్ వైపు మళ్లితే ఏపీలో రాజకీయంగా పొత్తుల అంచనాలు మారే అవకాశం ఉందనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలు సైతం బీజేపీ -పవన్ పొత్తు..ఫలితాలు ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపుతాయని తేల్చి చెప్పారు.
రేవంత్ కీలక వ్యాఖ్యలు: ఇదే సమయంలో కేసీఆర్ కు టీడీపీ..చంద్రబాబు పైన కక్ష పూరిత ఆలోచన ఉందంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రానికి సూచనలు..సలహాలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఎవరూ తనకు ఎదురు ఉండకూడదనేది కేసీఆర్ వ్యవహార శైలిగా రేవంత్ విశ్లేషించారు. కేసీఆర్ ఓటమి ఖాయమని చెబుతున్న రేవంత్..కేసీఆర్ ఓటమికి చంద్రబాబు అరెస్టు కారణం అవుతుందో లేదో తెలియదని వివరించారు.
ఇక, తెలంగాణ ఎన్నికల తరువాత ఏపీలో రాజకీయం పైన బీజేపీ ఫోకస్ చేస్తుందనే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు టీడీపీ మద్దతు ఓటింగ్ కోసం తెలంగాణలో కాంగ్రెస్ వర్సస్ జనసేన మధ్య పోటీ నెలకొంది. తెలంగాణ ఫలితాలు..ఓట్ల లెక్కలే ఏపీలో పొత్తుల లెక్కలను తేల్చటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications