పవన్ మాటలు కరెక్ట్-సమర్ధించిన రోజా-చంద్రబాబునూ అడగాలని సూచన..!
ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నా హోంమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తాము ఇన్నాళ్లుగా చేస్తున్న విమర్శలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో నిజమని తేలిందని వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా తెలిపారు.
ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో ముందుకెళ్తోందని, ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని రోజా ఆరోపించారు. 120 రోజుల్లో 100కు పైగా అత్యాచారాలు, హత్యలు జరిగాయని, మనం ఎక్కడున్నానమనే భయం వేస్తోందన్నారు. పాలకులు ప్రజలతో ఎన్నుకోబడితే వాగ్దానాలు నెరవేర్చాలన్న ఆలోచన ఉంటుంది, భయం ఉంటుందని, ఈవీఎంలతో గెలిస్తే ఇలాగే ఉంటుందన్నారు.
మహిళ హోంమంత్రిగా ఉండి కూడా మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారని ఆర్కే రోజా ఆరోపించారు. గతంలో జగన్ తెచ్చిన దిశ యాప్, దిశ పోలీసు స్టేషన్లను ఈ ప్రభుత్వం నిర్వీర్వం చేసిందని, ఇప్పుడు పవన్ కూడా అదే చెప్పారన్నారు.
తాము చెప్తే ఎగిరిన హోంమంత్రి ఇప్పుడేం సమాధానం చెప్తారని రోజా ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పవన్ మాటలు గమనించాలని రోజా కోరారు.

హోంమంత్రీ నీ వల్ల పనిచేయడం చేతకాకపోతే నేను హోంమంత్రి పదవి తీసుకోవడానికి సిద్దమని పవన్ చెప్పారని, తాను హోంమంత్రి అయితే యోగీ ఆదిత్యనాథ్ దాస్ లా పనిచేస్తానని హెచ్చరికలు చేశారని రోజా తెలిపారు. హోంమంత్రి విఫలమైనట్లు సహచర మంత్రే చెప్పారు కాబట్టి ఇప్పటికైనా ఆమె రాజీనామా చేయాలని రోజా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పేరు చెప్పి పవన్ హోంమంత్రిలా పనిచేస్తానంటున్నారని, కానీ ఆయన కాదు చంద్రబాబు హోంమంత్రిలా పనిచేయాలని రోజా సూచించారు.
డీజీపీ, ఇంటెలిజెన్స్ తో పాటు అన్ని విభాగాలు చంద్రబాబు చేతిలో పెట్టుకుని విఫలమవుతున్నారు కాబట్టి చంద్రబాబును రాజీనామా చేయాలని పవన్ కోరాలన్నారు. పవన్ అప్పుడప్పుడూ కుంభకర్ణుడిలా వరదలు వచ్చినప్పుడు ఆరు రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వైసీపీని తిట్టి వెళ్తారని, పిఠాపురంలో మహిళను మానభంగం చేసి నెలన్నర అయితే పరామర్శించకుండా ఇప్పుడు వచ్చి ప్రతిపక్షంలో ఉన్నట్లు మాట్లాడుతున్నారని రోజా ఆక్షేపించారు.
పవన్, చంద్రబాబు, హోంమంత్రి విఫలమయ్యారని, రాష్ట్రంలో పోలీసులను తిట్టడం ఫ్యాషన్ గా పెట్టుకున్నారన్నారని రోజా ఆరోపించారు. మీరు కరెక్ట్ గా ఉంటే పోలీసులు ఎందుకు పనిచేయరని ప్రశ్నించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పోలీసులు సక్రమంగా పనిచేశారని, మీకు కావాల్సిన వాళ్లను నియమించుకున్నప్పుడు వారితో పనిచేయించుకునే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. మీ మాట విని పనిచేయని పోలీసుల్ని ఎందుకు సస్పెండ్ చేయడం లేదని వారిని రోజా ప్రశ్నించారు.
ప్రజాప్రతినిధి అయి ఉండి ప్రజల్ని, మహిళల్ని కాపాడాల్సిన బాథ్యత ఎలా ఉందో, అధికారులకూ అలాగే ఉంటుందని రోజా గుర్తుచేశారు. చెప్పినా పనిచేయని వారిని ఉంచుకుని ఎందుకు వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని రోజా ప్రశ్నించారు.
అధికారులతో పనిచేయించాల్సిన బాధ్యత సీఎం, డీసీఎంలకు ఉందని, ఇతరులపై తప్పు నెట్టేసి తప్పించుకుందామని చూడటం సరికాదన్నారు. అధికారంలో ఉన్నవారు ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత, సంక్షేమం చూడాాల్సిన బాధ్యత, అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంటుందన్నారు.
నన్ను చూసి జనం ఓట్లేశారు, జగన్ ను పడగొట్టానని చెప్పుకుంటున్న పవన్.. వరదల్లో పిఠాపురం మునిగిపోతే షూటింగ్ చేసుకుంటూ ఉన్నారు తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. పిఠాపురంలో నెలన్నర క్రితం టీడీపీ నేత అమ్మాయిని రేప్ చేస్తే ఏం చేశారని పవన్ ను రోజా ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా, పార్టీ అధినేతగా పవన్ విఫలమయ్యారని, కానిస్టేబుల్ ను కూడా పెట్టుకోలేని అనితపై తోసేస్తే జనం పిచ్చోళ్లు కాదన్నారు. ఎవరో ఒకరిని బలి బశువును చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మీరు ప్రయత్నిస్తే జనం నమ్మరన్నారు. ముందు మీరు విఫలమయ్యారనే విషయం తెలుసుకుంటే జనం సురక్షితంగా ఉంటారన్నారు.












Click it and Unblock the Notifications