గుజరాత్‌లో ఆర్ఆర్ఆర్ రోడ్ షో: స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద: అమృత్‌సర్, వారణాసి: షెడ్యూల్ ఇదే
అమరావతి: అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్.. ఇంకొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన హైఓల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ మల్టీ స్టారర్ సినిమా ఇది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకుడు. డీవీవీ దానయ్య నిర్మాత. ఈ మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. బాహుబలి రికార్డులను సైతం తిరగరాస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

కర్ణాటక టు..
శనివారం రాత్రే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కర్ణాటకలోని చిక్‌బళ్లాపురలో నిర్వహించింది యూనిట్. లక్షలాది మంది అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్, శాండల్‌వుడ్ సూపర్‌స్టార్, హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ దీనికి హాజరయ్యారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో పాటు పలువురు యూనిట్ సభ్యులు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు.

గుజరాత్‌లో ల్యాండ్..
ఆ మరుసటి రోజే యూనిట్ గుజరాత్‌లో అడుగు పెట్టింది. హీరోలు రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కొద్దిసేపటి కిందటే వడోదర విమానాశ్రయంలో దిగారు. బెంగళూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ముగించుకున్న అనంతరం రాత్రి అక్కడే బస చేశారు. ఈ తెల్లవారు జామున బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరారు. వడోదర ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా కెవాడియాకు బయలుదేరి వెళ్లారు.

స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద..
కెవాడియాలో నిర్మించిన ప్రపంచలోనే ఎత్తయిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్టాట్యూ ఆఫ్ యూనిటీని సందర్శించారు. మ్యూజియాన్ని తిలకించారు. ఇక్కడే- ఆర్ఆర్ఆర్ రోడ్ షోను ప్రారంభించనున్నారు. దీనికోసం పలు వాహనాలను సిద్ధం చేశారు. రోడ్ షోలో వినియోగించడానికి ఎంపిక చేసిన కార్లపై ఆర్ఆర్ఆర్ పోస్టర్లు.. విడుదల తేదీని ముద్రించిన స్టిక్టర్లను అతికించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు.

ఢిల్లీ, అమృత్‌సర్‌లల్లో..
పాన్ ఇండియా మూవీ కావడం వల్ల అదే స్థాయిలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని చేపట్టింది యూనిట్. కర్ణాటకలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇప్పుడు వడోదరాలో రోడ్ షోను ప్రారంభించనుంది. అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళ్తుంది. దేశ రాజధానిలోనూ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ సాయంత్రం ఢిల్లీలో ఈ కార్యక్రమం ఉంటుంది. సోమవారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌ను సందర్శించనుంది. అక్కడ కూడా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటుంది.

ఎల్లుండి వారణాసితో ముగింపు..
అదే రోజు రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోనూ ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఎల్లుండి ఉదయం కోల్‌కత, అదే రోజు సాయంత్రం ఉత్తర ప్రదేశ్‌లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం వారణాసిలో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వారణాసిలో నిర్వహించే ప్రోగ్రామ్‌ను ముగించుకుని 23వ తేదీన హైదరాబాద్‌కు చేరుకుంటుంది యూనిట్. దీనితో దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రమోషన్‌ను నిర్వహించినట్టవుతుంది. 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందీ మచ్ అవైటెడ్ మూవీ.












Click it and Unblock the Notifications