Nara Lokesh : త్వరలో లోకేష్ అరెస్టు ? ఢిల్లీ నుంచి రాగానే చేస్తారనే ప్రచారం ! మరో కేసులో...
ఏపీలో విపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేసి రిమాండ్ కు పంపి వారం దాటిపోయింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ కేసు ఏసీబీ కోర్టులో, క్వాష్ పిటిషన్ హైకోర్టులో విచారణకు ఎదురుచూస్తున్నాయి. ఈ రెండు కేసుల్లోనూ విచారణ రేపు తిరిగి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ వారం చంద్రబాబు భవితవ్యం తేలబోతోంది. అదే సమయంలో మరో కేసులో ఆయన తనయుడు నారా లోకేష్ ను అరెస్టు చేసేందుకు సీఐడీ సిద్దమవుతోందన్న వార్తలు ఇవాళ చక్కర్లు కొడుతున్నాయి.
చంద్రబాబు అరెస్టు జరిగిన తీరుపై జాతీయ స్దాయిలో నేతల్ని కలిసి వివరించేందుకు, నిరసనలు చేపట్టేందుకు ఆయన తనయుడు నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఇవాళ రాత్రికి తిరిగి రాజమండ్రి రానున్నట్లు తెలుస్తోంది. ఆయన రాజమండ్రిలో అడుగు పెట్టగానే సీఐడీ అధికారులు అరెస్టు చేస్తారన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. లోకేశ్ అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాలు సిద్ధం చేశారని కూడా ప్రచారం సాగుతోంది.

మరోవైపు ఇప్పుడే తొందరపడి లోకేశ్ ను అరెస్ట్ చేయరంటూ మరో ప్రచారం కూడా సాగుతోంది. చంద్రబాబు అరెస్ట్ తో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వెల్లువెత్తిన ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో లోకేష్ అరెస్టు ఉండకపోవచ్చని మరో వర్గం వాదిస్తోంది.లోకేష్ ను అరెస్ట్ చేస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది ప్రభుత్వం మదింపు చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా సీఐడీ వర్గాలు సమాయత్తమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసిన సీఐడీ.. లోకేష్ ను మాత్రం ఈ కేసులో కాకుండా ఏపీ ఫైబర్ గ్రిడ్ స్కాంలో అరెస్టు చేయబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటికే కొందరిని సీఐడీ అరెస్ట్ చేసింది. వీరికి కోర్టుల్లో బెయిల్ కూడా లభించింది. ఈ నేపథ్యంలో లోకేష్ ను కూడా ఈ కేసులో అరెస్టు చేయొచ్చనేది తాజా ప్రచారాల సారాంశం. దీంతో రాష్ట్రంలో రాజకీయ వర్గాలు మరోసారి అప్రమత్తం అయ్యాయి..












Click it and Unblock the Notifications