Sana Satish Babu: లోకేష్ సన్నిహితుడికి టీడీపీలో కీలక పదవి..! బిగ్ ప్రమోషన్..!
ఏపీలో కూటమి సర్కార్ ను నడుపుతున్న తెలుగుదేశం పార్టీలో ఇవాళ జాతీయ, రాష్ట్ర కమిటీల నియామకాలు జరిగాయి. వీటిలో మంత్రిగా ఉన్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కింది. చంద్రబాబు వారసుడిగా ఇప్పటికే పార్టీలో, ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరిస్తున్న లోకేష్.. ఇవాళ జరిగిన నియామకాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఇందులో భాగంగా ఆయన సన్నిహిత ఎంపీకి కీలక పదవి ఇప్పించుకున్నారు. ఆయనే సానా సతీష్ బాబు (sana satish babu).
లోకేష్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన టీడీపీ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబును పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 18 మంది సభ్యులతో కూడిన జాతీయ ఉపాధ్యక్షుల బృందంలో సానా సతీష్ బాబుకు స్థానం కల్పించారు. దీంతో ఆయనకు మరో ప్రమోషన్ దక్కినట్లయింది. కాకినాడకు చెందిన సానా సతీష్ బాబు.. విపక్షంలో ఉండగా టీడీపీ కోసం తీవ్రంగా శ్రమించారు. దీంతో సానా సతీష్ బాబుకు కూటమి అధికారంలోకి వచ్చాక తగిన గౌరవం లభిస్తోంది. ఇందులో భాగంగా లోకేష్.. తన సన్నిహితుడికి తొలుత రాజ్యసభ ఎంపీగా పంపారు. ఆ తర్వాత ఇవాళ జాతీయ ఉపాధ్యక్ష పదవిలో నియమించారు. సానా సతీష్ నియామకంపై పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

తనను టీడీపీ ఉపాధ్యక్షుడిగా నియమించడంపై స్పందించిన ఎంపీ సానా సతీష్ బాబు. క్యాడర్ టు లీడర్ తమ పార్టీలోనే సాధ్యమని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబుకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.క్యాడర్ నుంచి లీడర్‌గా ఎదగడానికి అవకాశం తెలుగుదేశం పార్టీలోనే ఉందని, కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీ తప్పకుండా గుర్తింపు ఇస్తుందని సతీష్ బాబు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి, ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications