మహిళా వెయిట్ లిఫ్టర్లపై కోచ్ లైంగిక వేధింపులు..! ఏలూరు స్పోర్ట్స్ హాస్టల్లో..!
ఏపీలో క్రీడల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు ఓవైపు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు క్రీడల పట్ల ఆసక్తితో హాస్టళ్లకు వచ్చి శిక్షణ పొందుతున్న మహిళా క్రీడాకారుల్ని కోచ్ లే చెరపడుతున్నారు. మీకు ట్రైనింగ్ ఇవ్వాలంటే మా కోరికలు తీర్చాలంటూ వేధిస్తున్నారు. ఈ వేధింపుల్ని తాళలేక వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయాల్సిన పరిస్ధితి. ఇలాంటి ఓ ఘటన ఏలూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) హాస్టళ్లో చోటు చేసుకుంది.
ఏలూరులోని శాయ్ హాస్టళ్లో ఉంటూ మహిళా వెయిట్ లిఫ్టర్లు కొంతకాలంగా శిక్షణ పొందుతున్నారు. అక్కడ వినాయక్ ప్రసాద్ అనే కోచ్ వారిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు వారు ఫిర్యాదులు చేస్తున్నారు. ఏలూరు శాయ్ హాస్టల్ ఇన్చార్జ్, అథ్లెటిక్స్ కోచ్ కూడా ఉన్న వినాయక్ ప్రసాద్ వారిని వేధిస్తున్నట్లు వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై బెంగళూరు నుంచి వచ్చిన ఓ విచారణ బృందం ఆరోపణలపై క్రీడాకారిణుల నుంచి వివరాలు సేకరించింది. ఇందులో కోచ్ వేధింపులు నిజమేనని తేలింది.

నిన్న వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, తదితర విభాగాల్లో శిక్షణ పొందుతూ వసతి పొందుతున్న బాలికలను బెంగళూరు నుంచి వచ్చిన అధికారులు విచారించి,పూర్తి వివరాలు రాబట్టారు. అనంతరం లైంగిక వేదింపులు వాస్తవమేనని నిర్ధారించుకుని ఏలూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందులో ఆరోపణలు వాస్తవమని తేలితే కోచ్ పై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా శాయ్ హాస్టల్్ ఇన్ఛార్జ్, జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ కోచ్ పై ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళా వెయిట్ లిఫ్టర్లు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications