జగన్ కొంపముంచిన ఆ ఇంటర్య్వూ..?
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు కూటమికి పట్టం కట్టారు. కూటమి తరుఫున నాయకులందరూ కూడా విజయం సాధించారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేష్ వంటి నేతలు భారీ విజయాలను నమోదు చేశారు. అధికార వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. వైసీపీ కీలక నేతలు, మంత్రులు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. గత ఎన్నికల్లో 151 సీట్లలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ.. తీవ్ర ప్రజాగ్రహానికి లోనై కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది.
2019 ఎన్నికల్లో 22 పార్లమెంట్ స్థానాలకు గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలైయ్యాయి. అయితే కర్ణుడు చావుకు వంద కారణాలు ఉన్నట్టు వైసీపీ ఓడిపోవడానికి అనేక కారణాలున్నాయనేది రాజకీయ విశ్లేషకుల మాట. అభివృద్ది లేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత, మూడు రాజధానుల నిర్ణయం మొదలగు కారణాలతో వైసీపీ ఓడిపోయిందని చర్చించుకుంటున్నారు. వైసీపీ ఓటమిలో జగన్ చేసిన స్వయంకృపరాధం కూడా ఉందని అంటున్నారు.

కార్యకర్తలను దూరం చేసుకున్న జగన్ ..ఐ ప్యాక్ ఇచ్చిన నివేదికపైనే అధిక విశ్వాసం ఉంచడం, వాలంటీర్ల గెలిపిస్తారులే అని ధీమాకు పోవడం వల్లే వైసీపీ ఓడిపోయిందనే విశ్లేషణ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ అధినేత జగన్ ఓ ప్రముఖ వార్త ఛానెల్‌కు ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చారు. ఆ ఇంటర్య్వూ కూడా వైసీపీ ఓటమికి దారి తీసిందనే చర్చ సాగుతోంది.ఈ ఇంటర్య్వూలో జగన్ మాట్లాడుతూ..మొత్తం సీట్లు తామే గెలుస్తామని చెప్పడం ద్వారా క్యాడర్‌లో జోష్ నింపినప్పటికి , ప్రజల్లోకి మాత్రం నెగిటివ్ ఇంపాక్ట్ కలుగచేసిందనే అభిప్రాయం కలుగుతోంది.
ఎంతటి కొమ్ములు తిరిగిన నేతలు అయినా మాకు ఓటు వేయండి అని కోరతారు. కానీ జగన్ మాత్రం మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అంటూ అతి విశ్వాసానికి వెళ్లినట్టు కనిపిస్తోంది. గెలుపు ఎపుడో డిసైడ్ అయిపోయిందనే భ్రమలో ఉండి.. ఎన్నికలు జస్ట్ లాంఛనం అన్నట్లుగా జగన్ మాట్లాడినట్టుగానే జనాలు అర్ధం చేసుకున్నారు. జగన్ మాటలు ఆత్మ విశ్వాసంతో చెప్పవచ్చు కానీ అది కాస్తా జనంలోకి గర్వంతో కూడిన మాటలుగా వెళ్ళాయని అంటున్నారు. దాని ఫలితమే దారుణమైన ఫలితాలని చెబుతున్నారు. ఆ ఒక్క మాటతోనే ఏపీకి జగన్ అవసరం లేదని జనాలు తేల్చేసారా అన్న చర్చ కూడా ఇపుడు నడుస్తోంది.జగన్ ఓటమిలో ఈ ఇంటర్య్వూ కూడా భాగస్వామి అయిందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదని రాజకీయ విశ్లేషకులు తేల్చేస్తున్నారు.












Click it and Unblock the Notifications