సీఎంపై నోటీసు తిరస్కరణ - టీడీపీ సభ్యుల సస్పెన్షన్ : స్పీకర్ తాజా ఆంక్షలు..!!
ఏపీ శాసనసభలో టీడీపీ సభ్యుల ఆందోళన కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు టీడీపీ సభ్యులను సభ సస్పెండ్ చేసింది. సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారంటూ టీడీపీ సభ్యుల పైన స్పీకర్ అసహనం వ్యక్తం చేసారు. జంగారెడ్డి గూడెం మరణాల పైన చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు పట్టు పట్టారు. జంగారెడ్డి గూడెం ఘటన పైన సీఎం చేసిన వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి పైన టీడీపీ నోటీసు ఇచ్చింది. ఆ నోటీసు ను స్పీకర్ తిరస్కరించారు. ఆ సందర్భంలో సీఎంను ఉద్దేశించి టీడీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలతో ఒక్క సారిగా వైసీపీ సభ్యులు సీరియస్ అయ్యారు.

వైసీపీ నేతల ఆగ్రహం
ఇటువంటి వ్యాఖ్యలు రిపీట్ అవుతే చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారు. ప్రశ్నోత్తరాలు కొనసాగుతండగానే టీడీపీ సభ్యులు తమ నిరసన కొనసాగించారు. స్పీకర్ పోడియం పైకి ఎక్కి నినాదాలు చేసారు. స్పీకర్ వారించినా వెనక్కు తగ్గలేదు. ప్రశ్నోత్తరాలు ప్రారంభం అయిన సమయం నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. సభలో టీడీపీ సభ్యులు చప్పట్లు కొట్టారు. తమ గోడు వినిపించుకోవడం లేదంటూ నినాదాలు చేస్తూ...ఆ తరువాత చప్పట్లు కొట్టారు. టీడీపీ సభ్యులు చప్పట్లు కొట్టడం ఏంటని స్పీకర్ తమ్మినేని సీతారాం అభ్యంతరం తెలుపుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్పీకర్ తాజా రూలింగ్
జే బ్రాండ్స్ మద్యం, నాటుసారాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారంటూ సమావేశాలకు ముందు ప్లకార్డులు ప్రదర్శించారు. ఇక, సభలో స్పీకర్ తాజాగా రూలింగ్ ఇచ్చారు. సభలో సభ్యుల మొబైళ్లకు అనుమతి లేదని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. సభ్యులు సభా సంప్రదాయాలను పాటించాలన్నారు. సభా కార్యకలాపాలకు సహకరించి సభ్యులు హుందాగా మెలగాలని స్పీకర్ హితవు పలికారు. దీనికి టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ గందరగోళంతో సభలో ఉన్న టీడీపీ సభ్యులను ఈ ఒక్క రోజు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Recommended Video


టీడీపీ సభ్యుల సస్పెన్షన్
సభలో మొబైల్స్ వినియోగంతో పాటుగా.. ప్లకార్డులు..రెచ్చగొట్టే వ్యాఖ్యలు - నినాదాలకు అవకాశం లేదని రూలింగ్ ఇచ్చారు. అసెంబ్లీ రూల్ 317 లో వీటిని కూడా చేర్చుతున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అంతకు ముందు సభలో టీడీపీ సభ్యుల నినాదాలతో ఎమ్మెల్యేల అంబటి రాంబాబు.. కాపు రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ శవ రాజకీయాల ను చేస్తోందని ఆరోపించారు. సభ జరగకుండా అడ్డుకుంటోందని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications