భక్తజన సంద్రం.. గోవింద నామస్మరణం: తిరుమలలో అంబరాన్నంటిన వైభవం
తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు నవాహ్నిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ఆరంభం అయ్యాయి. 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా శ్రీనివాసుడి సేనాధిపతి శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.
వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఈ నవరాత్రల పాటు ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడం దీని వెనుక ఉన్న విశిష్టత. అలాగే.. శ్రీవారు, ముక్కోటి దేవతల ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. సూర్యాస్తమయం తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని సస్యకారక అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం మంచిది కాదు.

సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో పలు పవిత్ర విత్తనాలు నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు ఎంతబాగా మొలకెత్తితే ఉత్సవాలు అంత గొప్పగా సాగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. విత్తనాలు నాటడానికి పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు.
అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు. అనంతరం భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు.
ఈ విత్తనాల్లో గోధుమలు- సూర్యుడు, బియ్యం- చంద్రుడు, కందులు- కుజుడు, పెసలు- బుధుడు, శనగలు- బృహస్పతి, అలసందలు- శుక్రుడు, నువ్వులు- శని, మినుములు- రాహువు, ఉలవలు- కేతువుకు ప్రతీకలుగా భావిస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల మధ్య సాగుతుంది.












Click it and Unblock the Notifications
