వైభవంగా శ్రీవారి చక్రస్నానం.. రోజంతా పవిత్ర ఘడియలు
తిరుమలలో ఈ నెల 12వి తేదీన ఆరంభమైన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు వచ్చాయి. తొమ్మిదిరోజుల పాటు అత్యంత వైభవంగా సాగిన బ్రహ్మోత్సవ కోలాహలానికి నేటితో తెరపడనుంది. ముగింపు సందర్భంగా శ్రీవారి చక్రస్నానం వైభవంగా ఆరంభమైంది కూడా. కొద్దిసేపటి కిందటే ఈ క్రతువును శాస్త్రోక్తంగా ఆరంభించారు టీటీడీ అర్చకులు. శ్రీవారి ఆలయంలో చక్రానికి వైదిక క్రతువుల అనంతరం పుష్కరిణిలో పవిత్ర స్నానాన్ని ఆచరింపజేస్తారు అర్చకులు.
దీనికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. పుష్కరిణిలో ఒకేసారి సుమారు 9,450 మంది భక్తులు స్నానాలు ఆచరించేలా ఏర్పాట్లు చేసింది. భక్తుల రాకపోకల కోసం మొత్తం ఏడు ఎంట్రీ, 10 ఎగ్జిట్ ద్వారాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించే వేలాదిమంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విజిలెన్స్, పోలీసులు, టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పుష్కరిణిలో గజఈతగాళ్లు, బోటును అందుబాటులో ఉంచారు. అశ్విని ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య బృందాలు, అంబులెన్సులను సిద్ధం చేశారు. అత్యవసర వైద్య విభాగం సిబ్బందినీ పుష్కరిణి వద్ద మోహరింపజేశారు. పుష్కరిణి నీటి నాణ్యతను పరీక్షించి, నీరు కలుషితం కాలేదని నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు.
చక్రస్నానానికి విచ్చేసే భక్తులకు, విధుల్లో పాల్గొనే సిబ్బందికి ప్రత్యేకంగా అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు చేశారు. భక్తులు చక్రస్నానాన్ని వీక్షించడానికి వీలుగా ఆలయ పరిసరాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. చక్రస్నానం రోజున రోజంతా పవిత్ర ఘడియలు ఉంటాయని, భక్తులు ఒకేసారి గుంపుగా రాకూడదని కోరింది. తొందరపడకుండా అధికారుల సూచనల మేరకు క్రమపద్ధతిలో పుష్కరిణిలో స్నానాలు ఆచరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
నిర్దేశించిన మార్గాలు, గేట్ల ద్వారానే రాకపోకలు సాగిస్తూ సిబ్బందికి సహకరించాలని కోరింది. క్రమశిక్షణతో, సురక్షితంగా పుష్కరిణిలో స్నానాలు ఆచరించి శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరింది. ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో ప్రభల గోపీనాథ్, టీటీడీ సీవీఎస్వో కేవీ మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ప్రత్యక్షంగా పరిశీలించారు.














Click it and Unblock the Notifications
